
నేటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జనవరి 1 నుంచి 31 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు రవాణా శాఖ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, ప్రమాణ స్వీకారాలు నిర్వహించనున్నారు. రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని, ప్రతి పాఠశాల రోడ్ సేఫ్టీ క్లబ్‌లో చేరాలని సూచించారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదని, అతివేగంతో వాహనం నడపకూడదని రవాణా శాఖ మంత్రి చెప్పారు.
అధికారిక గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల వల్లే మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని వివరించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని, రోడ్డు భద్రతను సమూహ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కల్లూరు మండలంలో సుమారు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నీరజ ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు మండలం నారాయణపురంలో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటిలో రూ.2 కోట్లతో నారాయణపురం–పేరువంచ రోడ్డు, రూ.4 కోట్లతో నారాయణపురం–రామకృష్ణపురం ,రూ.7 కోట్లతో పేరువంచ–కుప్పనకుంట్ల ,రూ.2 కోట్లతో కొత్త నారాయణపురం నుంచి ఎన్‌ఎస్‌పీ కెనాల్ లిఫ్ట్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయనున్నారు.
ప్రతి పల్లెకు మౌలిక వసతులు కల్పిస్తాం
ఈ సందర్భంగా పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రజాప్రతినిధులు, ప్రహారీ గోడతో సహా పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పొంగులేటి మాట్లాడుతూ వంద శాతం ప్రతి పల్లెకు మౌలిక వసతులు కల్పించే వరకు విశ్రమించేది లేదని, గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని, వచ్చే ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు.
