
నెతన్యాహుతో చర్చించాకే యుద్ధం ముగింపుపై నిర్ణయం: ట్రంప్
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడం అనేది అమెరికా, ఇజ్రాయెల్‌ల ఉమ్మడి నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సంప్రదించిన తర్వాతే, సరైన సమయంలో తాను తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ పలు కీలక అంశాలపై స్పందించారు.
ఇజ్రాయెల్‌ను కాపాడటమే మా లక్ష్యం
ప్రస్తుత సైనిక చర్యకు ముందు ఇరాన్ శక్తులు ఇజ్రాయెల్‌ను సర్వనాశనం చేసేందుకు సిద్ధమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. "ఇరాన్ కేవలం ఇజ్రాయెల్‌నే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ తుడిచిపెట్టేయాలని చూసింది. కానీ మేం కలిసి పనిచేశాం. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకున్న దేశాన్నే ఇప్పుడు నాశనం చేశాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుద్ధాన్ని నిలిపివేసే అధికారం కేవలం వాషింగ్టన్ చేతుల్లోనే ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇది పరస్పర అవగాహనతో జరిగే ప్రక్రియని, నెతన్యాహు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే తాను నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఒకవేళ అమెరికా దాడులు ఆపినా ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాడాల్సిన అవసరం వస్తుందా అన్న ప్రశ్నకు.. అటువంటి పరిస్థితి రాదని తాను భావిస్తున్నట్లు ఆయన కొట్టిపారేశారు.
వారసత్వ నియామకంపై ట్రంప్ స్పందన
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు టెహ్రాన్ ప్రకటించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ క్లుప్తంగా వ్యాఖ్యానించారు. అయితే వైట్ హౌస్ ఆమోదం లేకుండా కొత్త ఇరాన్ నాయకత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని ఆయన హెచ్చరించడం గమనార్హం.
నెతన్యాహుకు క్షమాభిక్ష పెట్టాల్సిందే!
ఇదే క్రమంలో ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలపై కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి, మోసం వంటి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ప్రధాని నెతన్యాహుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వెంటనే క్షమాభిక్ష ప్రసాదించాలని డిమాండ్ చేశారు. "నెతన్యాహు ఇప్పుడు యుద్ధంపై దృష్టి సారించాలి కానీ, ఇలాంటి కోర్టు కేసులపై కాదు. అధ్యక్షుడికి ఆ అధికారం ఉన్నా ఉపయోగించకపోవడం దారుణం" అని విమర్శించారు. దీనిపై హెర్జోగ్ కార్యాలయం స్పందిస్తూ.. ఇజ్రాయెల్ చట్టబద్ధంగా నడిచే సార్వభౌమ దేశమని, క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.
ప్రాంతీయ సమీకరణాల్లో మార్పులు
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ సంయుక్త సైనిక చర్యతో ఇరాన్ మునుపెన్నడూ లేనంత బలహీనపడిందని ట్రంప్ విశ్లేషించారు. "నెతన్యాహు లేకపోతే ఇవాళ ఇజ్రాయెల్ మనుగడలో ఉండేది కాదు" అని కొనియాడారు. ఇరాన్ బలహీనపడటం వల్ల హమాస్ వంటి ఇతర ప్రాక్సీ గ్రూపులు కూడా నిరాయుధులవుతాయని, ఇది ప్రాంతీయ శాంతికి దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం ఈ యుద్ధం మరో నాలుగు నుండి ఆరు వారాల పాటు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఎటువంటి నిర్దిష్ట గడువును ప్రకటించలేదు.
