
నీతి ఆయోగ్ సెమినార్‌లో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన 'బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్'లో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. 'ఆకాంక్షిత బ్లాక్ ప్రోగ్రామ్' కింద ఎంపికైన నిర్మల్ జిల్లాలోని పెంబి బ్లాక్ సాధించిన అద్భుత ప్రగతిని ఆమె ఈ జాతీయ వేదికపై వివరించారు.దక్షిణాది రాష్ట్రాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, అభివృద్ధి నిపుణులు పాల్గొన్న ఈ సదస్సులో మూడు ప్రధాన అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.
కలెక్టర్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పెంబి మండలంలో చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఒకప్పుడు వెనుకబడిన బ్లాక్‌గా ఉన్న పెంబి, నేడు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఎలా నిలిచిందో ఆమె వివరించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో పెంబి బ్లాక్ సాధించిన పురోగతిని చూపించడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేశారు. అలాగే, మహిళలలో, గర్భిణీ మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను తీరుస్తూ, వ్యాధుల గుర్తింపు, నివారణ, భూసార పరీక్షలు, విద్యార్ధుల అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు వంటి కనీస సదుపాయాల కల్పన. మౌలిక సదుపాయాల బలోపేతం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
తెలంగాణ నుంచి ఈ సెమినార్‌కు కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఎంపిక కాగా, అందులో నిర్మల్ జిల్లా ఒకటి కావడం విశేషం. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కలెక్టర్ పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో ఎదురైన సవాళ్లను అధిగమించి సాధించిన ఈ ఫలితాలు జిల్లాకే గర్వకారణమని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాన సాంకేతిక సెషన్స్
• విద్య & నైపుణ్యాభివృద్ధి
• ఆరోగ్యం, పోషణ & సామాజిక అభివృద్ధి
• యువ నైపుణ్యాభివృద్ధి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అమలు చేస్తున్న 'నిర్మాణ్' చొరవ ద్వారా అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరచడంపై చర్చించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని 'రూరల్ ఇంక్యుబేషన్ సెంటర్' మోడల్ ద్వారా గ్రామీణ యువతలో నైపుణ్యాన్ని ఎలా పెంపొందిస్తున్నారో వివరించారు.
బీదర్ జిల్లాలో రక్తహీనత నివారణకు చేపట్టిన 'అనీమియా ముక్త్' కార్యక్రమం, తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మాతా శిశు ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న 'అమ్మ రక్షిత' పథకం అందరినీ ఆకర్షించాయి. కర్నూలు జిల్లా కలెక్టర్ యువత నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన వినూత్న పద్ధతులను పంచుకున్నారు.
నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ.. ఒక జిల్లాలో విజయవంతమైన నమూనాలను ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జిల్లాల మధ్య పరస్పర అభ్యాసం దేశంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సమాచార మార్పిడి, వినూత్న ఆలోచనల ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఈ సెమినార్ పునరుద్ఘాటించింది.
