
నీటి వృథాపై కఠిన చర్యలు.. ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా
నగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి కఠిన చర్యలు చేపడుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సంస్థలపై జరిమానాలు విధించడంతో పాటు నీటి సరఫరాను నిలిపివేస్తోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు తాగునీటి కనెక్షన్‌ను తొలగించింది. జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేసింది.
జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని జూబ్లీహిల్స్ వార్డు, రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్‌లో నీటి దుర్వినియోగం జరుగుతోందంటూ జలమండలికి ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. విచారణలో నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించడంతో పబ్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం జరిమానా విధించి, నీటి కనెక్షన్‌తో పాటు కమర్షియల్ ట్యాంకర్ల సరఫరాను నిలిపివేశారు.
రానున్న వేసవిలో తాగునీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశమున్నందున ప్రజలు ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించాలని జలమండలి సూచించింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. నీటి దుర్వినియోగాన్ని ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు నీటి కనెక్షన్ల తొలగింపు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఫిర్యాదులకు ప్రత్యేక నంబర్లు
నగరంలో ఎక్కడైనా తాగునీటి వృథా, దుర్వినియోగం జరిగినట్లు గుర్తిస్తే ప్రజలు జలమండలికి సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ప్రాంతం, పూర్తి చిరునామాతో సహా 99499 30003 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని తెలిపారు. అలాగే 155313 కస్టమర్ కేర్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. తాగునీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని జలమండలి కోరింది.
