Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నిర్మాత ఏవీఎం శరావణన్ కన్నుమూత

నిర్మాత ఏవీఎం శరావణన్ కన్నుమూత

Koripelli Aditya
4 డిసెంబర్, 2025

చెన్నైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం స్టూడియోస్ యజమాని, దిగ్గజ నిర్మాత ఎం. శరావణన్(86) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్‌లో అంతిమ దర్శనార్థం ఉంచగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నివాళులర్పించారు.

సోషల్ మీడియాలో సీఎం స్టాలిన్ పోస్టు చేసిన సందేశంలో శరావణన్‌ను ‘శాంత స్వభావి, సరళ జీవి’గా కొనియాడారు. ద్రావిడ ఉద్యమ సినిమా ప్రస్థానంలో ఏవీఎం ప్రొడక్షన్స్ ఎంతో కీలక పాత్ర పోషించిందని, అన్నాదురై రాసిన ‘ఒరు ఇరవు’, కలైజ్ఞర్ కథానాయకుడిగా నటించిన ‘పరాశక్తి’, మురసోలి మారన్ ‘కులదైవం’ వంటి చిత్రాలతో ఈ సంస్థకు ద్రావిడ కుటుంబంతో రక్తసంబంధం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. ‘ఏవీఎం శరావణన్ మాకు సన్నిహిత స్నేహితుడు, కుటుంబ సభ్యుడిలాగా మమేకమయ్యాడు’ అని స్టాలిన్ ఆయన భావోద్వేగాన్ని తెలియజేశారు.

కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరావణన్, కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయన తండ్రి, దివంగత ఏవీ మెయ్యప్పన్ 1946లో స్థాపించిన ఈ సంస్థను 1979లో ఆయన మరణానంతరం శరావణన్, ఆయన సోదరుడు బాలసుబ్రహ్మణ్యం సంయుక్తంగా నడిపించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మించి, ఏవీఎం బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా నిలబెట్టారు.

1963లో వచ్చిన ‘నానుం ఒరు పెణ్’, 1986లో వచ్చిన ‘సంసారం అదు మిన్సారం’ వంటి చిత్రాలు వాణిజ్య సినిమా పరిధిని విస్తృతం చేసినవిగా పేరొందాయి. మెయ్యప్పన్ మరణానంతరం తమిళ సినిమాల నిర్మాణంలో ఏవీఎం దీర్ఘ విరామం తీసుకున్న తర్వాత మళ్లీ తిరిగి సినిమాలలోకి ప్రవేశించినప్పుడు, రజనీకాంత్‌పై పూర్తి నమ్మకంతో ‘మురట్టు కాళై’ అనే సినిమాను తీశారు. రతి అగ్నిహోత్రితో జోడీ కట్టిన ఈ సినిమా అప్పటి తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించి, రజనీని యాక్షన్ సూపర్‌స్టార్‌గా స్థిరపరిచింది.

అదే ఏవీఎం బ్యానర్‌లోనే కమల్‌హాసన్ బాలనటుడిగా తొలి పరిచయం అయ్యారు. 1960లో వచ్చిన ‘కలత్తూర్ కన్నమ్మ’తో ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. వైజయంతిమాల, శివాజీ గణేశన్, సివకుమార్ వంటి ఎంతో మంది దిగ్గజాలకు ఏవీఎం తొలి వేదికగా నిలిచింది.

స్టూడియోను ఆధునీకరిస్తూనే టెలివిజన్ సీరియల్స్, కొత్త మీడియా రంగాల్లోకి కూడా అడుగుపెట్టిన ఘనత శరావణన్‌దే. 1986లో మద్రాస్ షెరీఫ్‌గా కూడా పదవిని చేపట్టారు. ఆయన తనయుడు ఎం.ఎస్. గుహన్ కూడా ప్రముఖ నిర్మాతగానే కొనసాగుతున్నాడు.

నివాళులర్పించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఏవీఎంతో నేను చేసిన తొమ్మిది సినిమాలూ మహా హిట్లే! ‘మురట్టు కాళై’తో 80వ దశకంలో బ్రేక్ ఇచ్చిన శరావణన్, 2020లో ‘శివాజీ ది బాస్’తో మళ్లీ భారీ విజయాన్నిచ్చారు. ఇంకో గ్రాండ్ సినిమా చేద్దామని అనుకునేవారు. అది నెరవేరలేదు’ అని ఆయన బాధపడ్డారు.

నటుడు శివకుమార్ (సూర్య తండ్రి) మాట్లాడుతూ... ‘పది రోజుల క్రితమే ఆయనతో మాట్లాడాను. ఎంతో సుఖాంతంగా వెళ్లిపోయారు. పడకమీద పడి బాధపడకుండా, 86 ఏళ్లు సార్థకంగా జీవించారు’ అని కొనియాడారు.

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటనలో శరావణన్ మరణాన్ని ‘తాటి చెట్టు పడిపోయినట్లు’ భావోద్వేగంగా పోల్చింది. ఎం.జీ.ఆర్, శివాజీ, కమల్, రజనీ, విజయకాంత్, అజిత్, భాగ్యరాజు, పాండియరాజన్ వంటి దిగ్గజాలతోపాటు చిన్న బడ్జెట్‌లోనూ అద్భుతమైన చిత్రాలు అందించిన ఘనత ఏవీఎందే అని కౌన్సిల్ కొనియాడింది.

ఎండీఎంకే అధ్యక్షుడు వైకో సహా ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శరావణన్‌కు నివాళులర్పించారు. తమిళ సినిమా ఒక యుగాన్ని కోల్పోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాత ఏవీఎం శరావణన్ కన్నుమూత - Tholi Paluku