

నిర్మలా సీతారామన్, చంద్రబాబు సమక్షంలో నేడు పల్నాడుకు రూ.3,216 కోట్ల రుణాల పంపిణీ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారికి తక్కువ వడ్డీతో సంస్థాగత రుణాలు అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారీ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం పల్నాడు జిల్లాలో నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు (జూలై 17న) నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేయనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లాలోని 1,03,246 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3,216 కోట్ల విలువైన రుణాలు మంజూరయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద జిల్లా స్థాయి క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమాల్లో ఇదొకటిగా నిలవనుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ప్రతి అర్హుడికి సంస్థాగత రుణం లక్ష్యం
అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో, తక్కువ వడ్డీతో రుణాలు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. మంజూరైన రుణాలను వచ్చే నెల రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేయనున్నారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), రిటైల్ రుణాలు, ఇతర ప్రాధాన్య రంగాలకు ఈ రుణాలు ఉపయోగపడనున్నాయి. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రైతులకు ప్రత్యేక ప్రాధాన్యం
వ్యవసాయ రంగానికి ఈ కార్యక్రమంలో అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) ద్వారా పంట రుణాలు అందించనున్నారు. అలాగే పశుసంవర్థక, మత్స్య రంగాలకు సంబంధించిన రైతులకు ప్రత్యేక కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలు) రుణాలు, ఇతర వ్యవసాయ ఆధారిత రుణ పథకాల ద్వారా కూడా ఆర్థిక సహాయం అందించనున్నారు.
స్వయం ఉపాధి, చిన్న వ్యాపారులకు ఊతం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, యువ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా పెద్దఎత్తున రుణాలు అందించనున్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి స్వనిధి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), పీఎం విశ్వకర్మ వంటి పథకాల కింద అర్హులైన వారికి రుణాలు మంజూరు చేశారు. దీంతో కొత్త వ్యాపారాల స్థాపన, చిన్న పరిశ్రమల విస్తరణకు అవసరమైన ఆర్థిక సహాయం అందనుంది.
విద్య, గృహ, వాహన రుణాలకూ అవకాశం
ఈ కార్యక్రమంలో భాగంగా గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు, ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద కూడా రుణాలు అందించనున్నారు. దీంతో సాధారణ కుటుంబాలు తమ అవసరాలకు తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం కలుగుతుంది.
సామాజిక భద్రతా పథకాలపై ప్రత్యేక దృష్టి
రుణాల పంపిణీతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సామాజిక భద్రతా పథకాలపై కూడా అవగాహన కల్పించనున్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన ద్వారా బ్యాంకు ఖాతాలు లేని వారిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ద్వారా ప్రమాద బీమా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా జీవిత బీమా, అటల్ పెన్షన్ యోజన ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ భద్రత కల్పించేందుకు నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, పల్నాడులో క్రెడిట్ అవుట్‌రీచ్‌ను మరింత విస్తరించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు తెలిపారు. రూ.3,216 కోట్ల రుణాల మంజూరు అనేది కేవలం రుణాల పంపిణీ మాత్రమే కాదని, వేలాది మంది తొలిసారిగా అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి అడుగుపెట్టే అవకాశమని అన్నారు.
లబ్ధిదారుల్లో అధికశాతం మంది చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని తెలిపారు. వీరికి సంస్థాగత రుణాలు అందడం వల్ల అధిక వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రైవేట్ వనరులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని, ఉపాధి, స్వయం ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పల్నాడులోని ప్రతి అర్హుడికి అధికారిక బ్యాంకింగ్ సేవలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం
కాగా, అధికారిక కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, బీజేపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఘన స్వాగతం పలికారు. వీరితోపాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు పల్నాడులో జరిగే రుణాల మంజూరు కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పల్నాడు ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారత ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి సంజయ్ లోహియా, బ్యాంకుల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లాలో రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారు, వెనుకబడిన వర్గాలకు చెందిన వేలాది కుటుంబాలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
