Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో అనుకున్నది సాధిస్తారా?

నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో అనుకున్నది సాధిస్తారా?

FL - SUNL
20 అక్టోబర్, 2025

పెట్టుబడులు ఆకర్షించే పనిలో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ ఆదివారం ఉదయం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. నవంబర్ 14 నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తల్ని ఆయన ఆహ్వానించనున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీ చేరుకున్నారు. ఆయనకు ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బ్రిస్బేన్‌, కాన్‌బెర్రా, అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు లోకేశ్‌ను కలిశారు.

‘స్పెషల్‌ విజిట్స్‌ ప్రోగ్రాం’లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హై కమిషనర్‌ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్‌ షోలలో పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. సాయంత్రం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్స్‌ ఆవరణలో తెలుగు డయాస్పోరాలో పాల్గొంటారు. అయితే పెట్టుబడుల ఆకర్షణలో లోకేశ్ ఎంత వరకు సక్సెస్ అవుతారనేది చూడాల్సి ఉంది.

లోకేశ్ టూర్ ఇలా

ఆదివారం ఉదయం సిడ్నీ చేరుకున్న అనంతరం ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలుగువారితో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా - ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ జోడి మెక్ కేతో సిడ్నీలో సమావేశమయ్యారు. కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం స్టేట్ ఎంగేజ్ మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు. ఏపీఈడీబీ, సీఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రాజెక్టుల్లో (ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో) భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈవోలకు మా రాష్ట్ర ప్రత్యేకతలను తెలియజేయాలని అన్నారు. తదుపరి సీఈవోల ఫోరం సెషన్ లో ఏపీ భాగస్వామ్యాన్ని అనుమతించాలని, ఆ సెషన్ లో ప్రాధాన్యత రంగాలు, పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులను ప్రదర్శిస్తామని చెప్పారు. ఫోరం వాణిజ్య, పెట్టుబడుల ఎజెండాలో “ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ – గేట్ వే ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా” అనే అంశంపై ఉమ్మడి నివేదికలకు అవకాశం కల్పించాలని అన్నారు. ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు. అనంతరం అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం. మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి. ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతరం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్ లో ఏపీ ఎన్ఆర్ టి ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకేష్ మాట్లాడుతూ.. ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారని, ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని దేశం ఏదీ లేదన్నారు. ‘మీరు మీ కంపెనీల్లో బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని ఇక్కడున్న వారిని కోరుతున్నా. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా. ఏదైనా కంపెనీ దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మాకు తెలియజేయండి. ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేం తీసుకుంటాం. గడచిన ఐదేళ్లు మీరు మాతో కలిసి పోరాడారు. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్ నిర్మాణం చేయాలి. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఏదీ అంత సులభం కాదు. నా జీవిత ప్రయాణం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కష్టపడదాం. ఒక ఫోకస్ తో పనిచేద్దాం. ఎదురుదెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామ’ని పిలుపునిచ్చారు.

20న: ఉదయం 9 గంటలకు రాండ్విక్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌వేల్స్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బిజినెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూసౌత్‌ వేల్స్‌ ఎంపీలు, వ్యాపార ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం 3కు అస్ట్రేలియా స్కూల్‌ అండ్‌ ట్రైనింగ్‌ మంత్రి ఆండ్రూగిల్స్‌తో కలసి టాఫే ఎన్‌ఎ్‌సడబ్ల్యూ అల్టిమో క్యాంప్‌సను సందర్శిస్తారు. 6.30కు ఎన్‌ఎ్‌సడబ్ల్యూ పార్లమెంట్‌ హౌస్‌ ఆవరణలో ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో కలసి రోడ్‌షోలో పాల్గొంటారు.

21న: ఉదయం 8.30కు పర్రమట్టలో సీఫుడ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఆస్ట్రేలియా నిర్వహించే ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11కు వెస్ట్రన్‌ సడ్నీ వర్సిటీకి వెళ్తారు. ఈ వర్సిటీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. 2 గంటలకు న్యూసౌత్‌వేల్స్‌ ఇన్నోవేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి అనోలాక్‌ చాంధివోంగ్‌తో భేటీ అవుతారు.

22న: ఉదయం 9 గంటలకు గోల్డ్‌ కోస్ట్‌ సౌత్‌ పోర్టులోని గ్రఫీత్‌ వర్సిటీకి వెళతారు. మధ్యాహ్నం 2కు బ్రిస్పేన్‌లో క్వీన్స్‌లాండ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3కు క్వీన్స్‌లాండ్‌ మంత్రితో సమావేశమవుతారు. సాయంత్రం 4కు రాష్ట్రంలో అధునాతన స్పోర్ట్స్‌ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్‌ లీడర్‌షిప్‌ టీమ్‌తో భేటీ అవుతారు.

23న: ఉదయం 9.30కు వర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు వెళతారు. మధ్యాహ్నం 2కు విక్టోరియా స్కిల్స్‌ మినిస్టర్‌ బెన్‌ కరోల్‌ను కలుస్తారు. సాయంత్రం 4.30కు యర్రావ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్‌ ఇండస్ట్రీని, ట్రైజరీ వైన్స్‌ ఎస్టేట్‌ను పరిశీలిస్తారు.

24న: ఉదయం 9 గంటలకు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా వాణిజ్య, పెట్టుబడుల కమిషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విద్యపై ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో లోకేశ్‌ పాల్గొంటారు. ఉదయం 11.30కు మెల్‌బోర్న్‌ గ్రాండ్‌ హయ్యత్‌ హోటల్‌లో ఏఐబీసీ ఆధ్వర్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా క్రికెట్‌ గ్రౌండ్‌లో స్పోర్ట్స్‌ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. రాత్రి మెల్‌బోర్న్‌లో బయలుదేరి 25న హైదరాబాద్‌కు చేరుకుంటారు.

నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో అనుకున్నది సాధిస్తారా? - Tholi Paluku