Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నాగ్‌పూర్ కార్మాగారంలో విస్పోటనం..17 మంది మృతి

నాగ్‌పూర్ కార్మాగారంలో విస్పోటనం..17 మంది మృతి

Pinjari Chand
1 మార్చి, 2026

ఉదయాన్నే ఎప్పటిలాగే పనులకు బయల్దేరారు. ఇదే తమ జీవితంలో చివరి రోజు అవుతుందని వారు ఊహించలేదు. ఓ తల్లి పిల్లలకు అన్నం వండి, ‘త్వరగా వచ్చేస్తా’ జాగ్రత అంటూ ఇంటి గడప దాటింది. మరో మహిళ ఇంటి పనులు ముగించుకుని ఆదివారం కాబట్టి సాయంత్రానికి కలిసి కూర్చుని తిందామని చెప్పి వెళ్లింది. కానీ వెళ్లిన గంటలోపే కర్మాగారాన్ని కుదిపేసిన భయానక పేలుళ్లు వారి ప్రాణాలను హరించాయి. క్షణాల్లోనే వారి జీవితాలు బుగ్గిపాలయ్యాయి. దీంతో తల్లిదండ్రుల రోదనలు, చిన్నారుల అమాయక ప్రశ్నలు అక్కడ ఉన్నవారిని కలిచివేశాయి. వారి మరణం ఆయా కుటుంబాలలో ఎప్పటికీ నిండని శూన్యాన్ని మిగిల్చింది.

గనులు, పరిశ్రమల కోసం ఉపయోగించే అధిక శక్తి గల పేలుడు పదార్థాలు తయారు చేసే యూనిట్‌లో ప్రమాదం జరిగి కనీసం 17 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించి కటోల్ తహసీల్‌లోని రౌల్‌గావ్ గ్రామంలో ఉన్న ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, ఉదయం 7 నుంచి 7.15 గంటల మధ్య డెటోనేటర్ ప్యాకింగ్ యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఘటన స్థలానికి బాధితుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ విపిన్ ఇటాంకర్, ఎస్పీ హర్ష్ పోదార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పేలుడుకు కారణాలపై సమగ్ర దర్యాప్తు ఆదేశించారు. సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే పెట్రోలియం, ఎక్స్ ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ), డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ సెక్యూరిటీ (డీఐఎస్ఎస్) అధికారులు కూడా పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే నాగ్‌పూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.

కంపెనీ తెలిపిన ప్రకటనలో, ప్యాకింగ్ విభాగంలోనే ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో యాక్టివ్ తయారీ కార్యకలాపాలు లేవని తెలిపింది. ఘటనపై అంతర్గత సమీక్ష ప్రారంభించామని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొంది. గాయపడిన వారి చికిత్స ఖర్చును పూర్తిగా భరిస్తామని తెలిపింది. ఈ ఘటనకు ఒకరోజు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో పేలుడు జరిగి 21 మంది మరణించారు.

కూతురి మృతితో తల్లి కన్నీరుమున్నీరు

భారీ పేలుడులో తన కూతురు మృతి చెందడంతో ఓ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. కాంతా చాచానే (42) ఆదివారం ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లింది. ఆమె అదే కర్మాగార ప్రాంగణంలోని మరో యూనిట్‌లో పనిచేస్తుండగా, ఆమె 26 ఏళ్ల కూతురు మంగేశ్రీ యేస్కర్ పేలుడు సంభవించిన విభాగంలో విధుల్లో ఉంది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని, దాదాపు గంటన్నర పాటు వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయని ఆమె గుర్తుచేసుకుంది. పేలుడు అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించగా, మంగేశ్రీ మరణించినట్టు అధికారులు ప్రకటించారు. నేను పూర్తిగా కదిలిపోయానని కాంతా చాచానే ఆవేదన వ్యక్తం చేసింది. మంగేశ్రీ గత సంవత్సరం నుంచే కర్మాగారంలో పనిచేస్తోంది. భర్తతో వేరుపడి, ఆమెకు ఓ కుమార్తె, చిన్న కుమారుడిని పోషిస్తూ జీవనం సాగిస్తోంది. ఆ ఉదయం తల్లి–కూతురు కలిసి ఫ్యాక్టరీకి చేరుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పేలుడులో కనీసం 17 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు తన కూతురు మృతదేహాన్ని తీసుకునేందుకు డీఎన్ఏ గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో, ఆ తల్లి మరింత బాధను అనుభవిస్తోంది.

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రధాని, సీఎం

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిహారం ప్రకటించారు. ప్రధాని మోడీ ఎక్స్లో చేసిన పోస్టులో ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక పరిపాలన బాధితులకు సహాయం అందిస్తోందని చెప్పారు. ప్రధాని జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రతి మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మృతుడి వారసులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. అదనంగా సంబంధిత సంస్థ కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

నాగ్‌పూర్ కార్మాగారంలో విస్పోటనం..17 మంది మృతి - Tholi Paluku