Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నాగర్ కర్నూల్‌‌లో రూ. 39 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన

నాగర్ కర్నూల్‌‌లో రూ. 39 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన

Gaddamidi Naveen
19 జనవరి, 2026

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఈ పర్యటన మరింత ఊపునిచ్చింది.

ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల సమీపంలో కేసరి సముద్రం మీద నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ వంతెన ద్వారా పరిసర గ్రామాలు, పట్టణానికి రాకపోకలు మరింత సులభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

అదేవిధంగా నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధి దిశగా ఈ పనులు కీలకమని, మౌలిక వసతుల మెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పట్టణంలోని జూనియర్ కాలేజీకి రూ.9 కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణానికి కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ భవనం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యావాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆయన అన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, నాగర్ కర్నూల్ పట్టణంలోని 245 మహిళా స్వయం సహాయక సంఘాలకు ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మొత్తం రూ.70,80,324 విలువైన ఈ సహాయం మహిళల జీవనోపాధి అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

నాగర్ కర్నూల్‌‌లో రూ. 39 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన - Tholi Paluku