
నన్ను 'అన్నా కొణిదెల' అని పిలవండి: అన్నా లెజినోవా
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. అందరూ తనను "అన్నా కొణిదెల" అని పిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2013లో పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకున్న తర్వాత అధికారికంగా తన భర్త ఇంటిపేరునే స్వీకరించినట్లు ఆమె స్పష్టం చేశారు.
తన పుట్టినరోజు దగ్గరపడుతున్న తరుణంలో ఈ విషయాన్ని పంచుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని అన్నా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక వ్యక్తికి వారి పేరు అత్యంత వ్యక్తిగతమైనది. ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచి ఈ విషయం రాయాలని అనుకుంటున్నాను. చాలామందికి నన్ను 'అన్నా లెజినోవా'గానే తెలుసు, ఎందుకంటే మా పెళ్లి సమయంలో వార్తల్లో ఆ పేరే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిందని ఆమె రాసుకొచ్చారు.
అయితే విచిత్రం ఏమిటంటే, మా పెళ్లి సర్టిఫికెట్ మాత్రమే నా పాత ఇంటిపేరు ఉన్న చివరి అధికారిక పత్రం. ఆ రోజే నేను నా భర్త ఇంటిపేరును స్వీకరించి 'అన్నా కొణిదెల'గా మారాను. అందుకే అందరికీ నాదొక చిన్న మనవి.. నన్ను 'అన్నా కొణిదెల' అని పిలవండి. ఆ పేరులోనే నాకు పూర్తి ఆత్మసంతృప్తి లభిస్తుందని అన్నా లెజినోవా కోరారు. ఈ సందర్భంగా సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా) పర్యటనలో పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక పాత జ్ఞాపకాల ఫోటోను కూడా ఆమె పంచుకున్నారు.
కాగా, ప్రముఖ నటులు చిరంజీవి, నాగబాబుల సోదరుడైన పవన్ కళ్యాణ్ సినీ రంగంలో 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. అంతకుముందు నందినిని వివాహం చేసుకోగా, ఆ వివాహ బంధం ముగిసింది. అనంతరం నటి రేణు దేశాయ్‌ను 2009లో వివాహం చేసుకున్నారు. వారికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అనంతరం 2013లో రష్యాకు చెందిన అన్నాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పోలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో నందిని, రేణు దేశాయ్‌లను వివాహం చేసుకున్న పవన్, అనంతరం వారితో విడిపోయిన సంగతి తెలిసిందే.
