Let's talk: editor@tmv.in
నందిగామలో చారిత్రాత్మక పాలకవర్గం రాబోతోంది: ఎమ్మెల్యే సౌమ్య

నందిగామలో చారిత్రాత్మక పాలకవర్గం రాబోతోంది: ఎమ్మెల్యే సౌమ్య

Gaddamidi Naveen
19 అక్టోబర్, 2026

నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సారథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి శాఖమూరు వంశీధర్‌తో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్‌లోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్‌కు చేరుకుంది. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జెండాలు, నినాదాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో చారిత్రాత్మక మున్సిపల్ పాలకవర్గం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో నందిగామ మున్సిపాలిటీకి రూ.154 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిందన్నారు. రూ.103 కోట్లతో ఇంటింటికీ కృష్ణా జలాలు అందించే పథకం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.19 కోట్లతో పెండింగ్ సీసీ రోడ్ల నిర్మాణం, నూతన మున్సిపల్ కార్యాలయం, పార్కు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. రూ.17 కోట్లతో పట్టణమంతటా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్రీయ విద్యాలయం, వంద పడకల ఆసుపత్రి ఆధునీకరణతో పట్టణాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు.

ఇవి కేవలం ఎన్నికల హామీలు కావని, నిధులు మంజూరై పనులు ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలని సౌమ్య పేర్కొన్నారు. చైర్మన్ అభ్యర్థి వంశీధర్ మాట్లాడుతూ.. 32 మంది కూటమి వార్డు సభ్యులతో కలిసి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మూడు పార్టీల ఐక్యతను ప్రజలు ఆదరించాలని, వంశీధర్‌తో పాటు కూటమి అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సౌమ్య విజ్ఞప్తి చేశారు.

నందిగామలో చారిత్రాత్మక పాలకవర్గం రాబోతోంది: ఎమ్మెల్యే సౌమ్య - Tholi Paluku