Let's talk: editor@tmv.in
దేశంలోనే తొలిసారిగా ‘నెలవారీ ఆర్థిక నివేదిక’ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

దేశంలోనే తొలిసారిగా ‘నెలవారీ ఆర్థిక నివేదిక’ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

Gaddamidi Naveen
15 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని నిరంతరాయంగా పర్యవేక్షించడానికి, డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా పరిపాలనను మరింత మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం 'నెలవారీ ఆర్థిక నివేదిక' విధానాన్ని ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారుల‌తో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన సేవల ద్వారా ప్రజల్లో సంతృప్తిని పెంపొందించడంపైనే అన్ని ప్రభుత్వ శాఖలు ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిని నిరంతరం పర్యవేక్షించడానికి, పరిపాలనను సులభతరం చేయడానికి దేశంలోనే మొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నెలవారీ ఆర్థిక నివేదికను తీసుకువస్తోందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సాంకేతికత, రియల్ టైమ్ (క్షణక్షణం అప్‌డేట్ అయ్యే) డేటాను ఉపయోగించుకోవడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఫలితాల ఆధారితంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, రాబడి వసూళ్లు వివిధ శాఖల పనితీరుపై నెలవారీగా అంచనాలు వేయడం వల్ల లోటుపాట్లను ముందే గుర్తించి, సకాలంలో దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి వీలవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నైపుణ్యాలను వారి పనితీరును కూడా క్రమం తప్పకుండా అంచనా వేస్తామని చెప్పారు.

ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారం

కొన్ని నిర్దిష్ట శాఖలపై ప్రజా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' ద్వారా అత్యంత వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో 'జీరో పెండెన్సీ' (ఏ ఒక్క ఫిర్యాదు కూడా నిలిచిపోకూడదు) సాధించాలని, పదేపదే వచ్చే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి నిబంధనలలో మార్పులు లేదా చట్ట సవరణలు అవసరమా అనే కోణంలో విశ్లేషణ చేయాలని సూచించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రస్తుత రెవెన్యూ శాఖకు పెద్ద ఎత్తున భూ సమస్యల ఫిర్యాదులు వారసత్వంగా వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా వివిధ జిల్లాల్లో పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోందని గుర్తుచేశారు.

పాలనను సరళీకృతం చేయడానికి ఆదాయ వసూళ్లను పెంచడానికి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాంకేతిక పరికరాలను అభివృద్ధి చేసిందని సీఎం వెల్లడించారు. ఈ ఆధునిక ప్రయత్నాల వల్ల వివిధ శాఖల్లో రాబడి వసూళ్లు 24 శాతం మేర పెరిగాయని, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం వృద్ధి నమోదైందని సీఎం వివరించారు. ఈ విజయానికి ఉమ్మడిగా కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. కీలక పదవుల్లో ఉన్న అధికారులు ప్రతికూల పాత్ర పోషించరాదని హెచ్చరిస్తూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సీనియర్ అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

విద్యుత్, సాగునీటి రంగాలపై కీలక ప్రకటనలు

వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడో ఏడాదిలోకి ప్రవేశిస్తున్నప్పటికీ "విద్యుత్ చార్జీలను పెంచలేదు" అని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు విద్యుత్ పన్నులు లేదా చార్జీలు పెంచబోమనే హామీకి కట్టుబడి ఉన్నామని, ట్రూ-డౌన్ సర్దుబాట్లను విజయవంతంగా అమలు చేయడం ద్వారా వినియోగదారులపై చార్జీల భారాన్ని తగ్గించామని పేర్కొన్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ వ్యూహాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌తో నడిచే ఇండక్షన్ స్టవ్వుల వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి ఉత్పాదనను విస్తరించడంపై భారీగా దృష్టి పెడతామన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా అందించగలిగామని, రాష్ట్రవ్యాప్తంగా నీటి సంరక్షణ కార్యక్రమాలు బాగా సాగుతున్నాయని, వీటిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పాలనలో అధికారులు చొరవ చూపి, సమస్యలు ఉత్పన్నం కాకముందే వాటిని ఊహించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

పోలవరం నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, దీనిని మార్చి 2027 నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. అలాగే, ఆగస్టు 14న‌ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను విడుదల చేస్తామని ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను సెప్టెంబర్ 1న‌ జాతికి అంకితం చేస్తామని, మిగిలిన 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సంబంధించిన గడువులను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

గడిచిన రెండేళ్ల ప్రభుత్వ పనితీరును సమీక్షిస్తూ.. 2019-2024 మధ్య కాలంలో పరిపాలనా వ్యవస్థలు తీవ్రంగా బలహీనపడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనా సంస్కరణల ద్వారా పాలనను పునరుద్ధరించడానికి సమిష్టిగా పనిచేసిందని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి సాధించి, ఆంధ్రప్రదేశ్ మరోసారి భారతదేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా అవతరించిందన్నారు. సమృద్ధిగా ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను కేవలం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగానే కాకుండా, దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPGovtChandrababuNaiduEconomicGrowthMonthlyEconomicReportDataDrivenGovernanceGoodGovernanceAPDevelopment