
దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేయాలి: సీఎం చంద్రబాబు
దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేసేలా ‘పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో ప్రజల చురుకైన భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
కార్యక్రమ రూపకల్పనపై శనివారం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తయి, 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశ నిర్మాణంలో తమ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించేలా అవగాహన కల్పించాలని సూచించారు. 2047 నాటికి రాష్ట్రం, దేశం సాధించాల్సిన లక్ష్యాలపై ప్రజలు స్వయంగా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు తమ వంతు కృషి చేసేలా ప్రోత్సహించాలని అన్నారు.
ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ‘నా దేశం.. దేశమే ప్రధానం’ అనే భావన ప్రతి ఇంటికీ చేరేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం చెప్పారు. గ్రామస్థాయి నుంచే వివిధ రంగాల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే వేదికలను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పునరుద్ధరించాలని, ప్రజలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలవాలని అన్నారు.
యువతలోని ఆలోచనలు, శక్తి, సామర్థ్యాలను దేశ నిర్మాణం వైపు మళ్లించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే ప్రజలు ఉండకుండా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వాములు, వాటాదారులుగా మారాలని ఆకాంక్షించారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను రూపొందించి, 2047 లక్ష్యాల దిశగా సాధించిన పురోగతిని ప్రతి ఏడాది ఆగస్టు 15న సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పౌరుడిని భాగస్వామిని చేసే ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
