
దెందులూరు రైతులకు సాగునీరు అందించాలి: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
దెందులూరు నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకుని రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని కృష్ణా ఈస్ట్ (కేఈ) కాలువ ఆయకట్టు కింద సుమారు 58 వేల ఎకరాల్లో వరి, ఆక్వా సాగు పూర్తిగా సాగునీటిపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ప్రస్తుతం సాగునీరు అందుబాటులో లేకపోవడంతో చరిత్రలో తొలిసారిగా రైతులు సాగు ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే భూములు దున్ని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసి భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు ప్రభుత్వం నుంచి నీటి లభ్యతపై స్పష్టత లేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే సాగునీటి లభ్యతపై స్పష్టమైన ప్రకటన చేయాలని, నీటిని అందించే అవకాశం లేకుంటే రైతులు చేసిన పెట్టుబడులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జిల్లా యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసి పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి కొప్పులవారిగూడెం వద్ద గుండేరు వాగులోకి నీటిని మళ్లించి, సీతంపేట కాలువ ద్వారా సుమారు 13,800 ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం గోదావరి కాలువ ద్వారా పంపింగ్ చేస్తున్న నీరు సరిపోవడం లేదని, అదనంగా మరో రెండు పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటి సరఫరాను పెంచాలని సూచించారు. అది సాధ్యం కాకపోతే రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కృష్ణా ఈస్ట్, పోలవరం కాలువల ద్వారా గ్రామ చెరువులను నింపి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తుందని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.
