
దివ్య దత్తా నటించిన ‘చిరయ్య’ మార్చి 20న జియో హాట్‌స్టార్‌లో విడుదల
దివ్య దత్తా, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన సామాజిక ఇతివృత్త చిత్రం ‘చిరయ్య’ విడుదలకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ శుక్రవారం ఈ ప్రాజెక్ట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. మార్చి 20 నుంచి ఈ సిరీస్ ప్రేక్షకులకు ముందుకు రానుంది.
ట్రైలర్‌లో ఈ చిత్రం ఒక ఉమ్మడి కుటుంబంలోని కోడలు కమలేష్ (దివ్య దత్తా) జీవితం చుట్టూ తిరుగుతుంది. తన అడపాదడపా సంతోషాలతో సాగిపోతున్న ఆమె జీవితం, తన ఆడపడుచు పూజ తన వైవాహిక జీవితంలో లైంగిక వేధింపులకు గురవుతోందని తెలుసుకున్నప్పుడు ఒక్కసారిగా తలకిందులవుతుంది.కుటుంబ గౌరవాన్ని కాపాడాలా లేక అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలా? అనే సందిగ్ధంలో కమలేష్ పడుతుంది.వివాహ బంధంలో కూడా సమ్మతి అనేది ఎంత ముఖ్యమో, పితృస్వామ్య భావజాలం మహిళల గొంతును ఎలా నొక్కుతుందో ఈ చిత్రం లోతుగా విశ్లేషిస్తుంది.
కమలేష్ పాత్రలో నటించిన దివ్య దత్తా మాట్లాడుతూ.. ఈ కథ మన ఇళ్లలో దశాబ్దాలుగా మౌనంగా భరిస్తున్న అన్యాయాలకు అద్దం పడుతుంది. కమలేష్ పాత్ర నా హృదయానికి చాలా దగ్గరైంది. ఆమె పోరాటం పెద్ద కేకలు వేస్తూ చేసే తిరుగుబాటు కాదు, ఒక మహిళ తన గౌరవం కోసం నిశ్శబ్దంగా చేసే మేల్కొలుపు అని భావోద్వేగంగా పేర్కొన్నారు. నటుడు సంజయ్ మిశ్రా స్పందిస్తూ.. చిరయ్య గొప్పతనం దాని నిజాయితీలో ఉంది. ఇందులో పాత్రలు హీరోలుగానో, విలన్లుగానో ఉండవు సమాజం, పెంపకం వల్ల ఏర్పడిన భయాల మధ్య జీవించే మనుషులుగా ఉంటాయి. కుటుంబాల్లోని మౌనం ఎలా అన్యాయానికి సహకరిస్తుందో ఈ చిత్రం చూపిస్తుందని అన్నారు.
దర్శకుడు శశాంత్ షా మాట్లాడుతూ, ఈ కథను అత్యంత సున్నితంగా, ఎటువంటి అతిశయోక్తులు లేకుండా తెరకెక్కించానని తెలిపారు. రోజువారీ జీవితంలో మనం సాధారణీకరించిన కొన్ని తప్పుడు ప్రవర్తనలే ఈ చిత్రంలోని అసలు అసౌకర్యానికి కారణమని ఆయన వివరించారు.
ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్‌లో సిద్ధార్థ్ షా, ప్రసన్న బిష్త్, టిన్నూ ఆనంద్, సరితా జోషి వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సమాజంలో ఎంతో కాలంగా చర్చకు నోచుకోని 'వైవాహిక సమ్మతి 'లింగ వివక్ష' వంటి అంశాలపై ఈ చిత్రం కొత్త చర్చను ప్రారంభిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
