Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
దశాబ్దానికి పైగా అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయే: ఇర్ఫాన్ పఠాన్

దశాబ్దానికి పైగా అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయే: ఇర్ఫాన్ పఠాన్

Pinjari Chand
19 జనవరి, 2026

స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో, తుది వన్డేలో విరాట్ కోహ్లీ తన 54వ వన్డే సెంచరీ సాధించిన తర్వాత, ఆయనను భారత్‌కు గత దశాబ్దానికి పైగా అత్యుత్తమ వన్డే బ్యాటర్ గా అభివర్ణించారు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్, విరాట్ కోహ్లీ స్థిరత్వం (కన్సిస్టెన్సీ), దీర్ఘకాలిక ప్రదర్శన (లాంగెవిటీ) అసాధారణమని అన్నారు. 2013 నుంచి 2026 వరకు దాదాపు పదేళ్లకుపైగా కాలంలో కోహ్లీ ఎప్పటికప్పుడు భారత్‌కి బెస్ట్ వన్డే బ్యాటర్‌గా గుర్తింపు పొందుతూనే ఉన్నాడని ఆయన చెప్పారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ స్వయంగా కెప్టెన్‌గా ఉన్నప్పుడు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ప్రస్తుతం యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో కూడా విరాట్ కోహ్లీ పరుగులు సాధించాడని పఠాన్ గుర్తు చేశారు. 2013లో నేను ఆడుతున్న రోజుల నుంచే విరాట్ కోహ్లీ భారత్‌లో బెస్ట్ బ్యాటర్ అని చెప్పేవారు. 2016లో కూడా అదే మాట. ఇప్పుడు 2026లో కూడా అతనే బెస్ట్ అని అంటున్నారు. ఇది అతని గొప్పతనం. ప్రతి కెప్టెన్ కింద అతను పరుగులు చేశాడని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించారు.

వయస్సు పెరిగినా.. ఫిట్‌నెస్‌ తగ్గలేదు

అలాగే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను కూడా పఠాన్ ప్రశంసించారు. అతన్ని ‘రన్ మెషీన్’గా అభివర్ణిస్తూ, వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్ మరింత మెరుగుపడుతోందని అన్నారు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌లో ఎలాంటి తగ్గుదల లేదు. ఇంకా మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఆడతాడు, పరుగులు చేస్తాడు, మళ్లీ అదే పని చేస్తాడని తెలిపారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులు చేసి తన 85వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆయన ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతని చివరి ఎనిమిది వన్డే ఇన్నింగ్స్‌లలో నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇందులో విజయ్ హజారే ట్రోఫీలో చేసిన సెంచరీ కూడా ఉంది. అయితే, విరాట్ కోహ్లీ సెంచరీ సాధించినప్పటికీ, భారత్ ఈ మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. కోహ్లీ శతకం ఓటమిలో నమోదైనప్పటికీ, అది అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్ అని పఠాన్ కొనియాడారు.

దశాబ్దానికి పైగా అత్యుత్తమ ఆటగాడు కోహ్లీయే: ఇర్ఫాన్ పఠాన్ - Tholi Paluku