
దక్షిణాదిలోనే తొలిసారిగా ఏఐజీ ఆస్పత్రిలో జాప్-ఎక్స్ రేడియో సర్జరీ వ్యవస్థ ప్రారంభం
మెదడు సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. దక్షిణాదిలోనే మొట్టమొదటిసారిగా, దేశంలోనే రెండోదిగా అత్యంత అధునాతనమైన 'జాప్-ఎక్స్ గైరోస్కోపిక్ న్యూరో-రేడియో సర్జరీ' ప్లాట్‌ఫారమ్‌ను శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే మెదడులోని కణతులను తొలగించే ఈ సరికొత్త సాంకేతికత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.
ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్య తెలంగాణే - మంత్రి దామోదర్
ఏఐజీ ఆస్పత్రిలో దక్షిణాదిలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన అత్యాధునిక న్యూరో ఆంకాలజీ జాప్-ఎక్స్ పరికరాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. సంస్థ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన ఈ కేంద్రాన్ని సందర్శించి, ఆధునిక పరిజ్ఞానాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 'ఆరోగ్య తెలంగాణ' నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కార్పొరేట్ తరహాలో టీమ్స్ ద్వారా అత్యాధునిక సేవలు అందిస్తున్నామని తెలిపారు. సామాన్యుల కోసం ఉచితంగా ఎన్‌సీడీ క్లినిక్స్, మొబైల్ స్క్రీనింగ్ సెంటర్లు, ప్రతి 40 కి.మీల పరిధిలో 104 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్య రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానవ వనరుల పటిష్టతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్లు, ఇతర న్యూరోలాజికల్ సమస్యలు భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య భారంగా మారుతున్నాయి. సంప్రదాయంగా ఈ సమస్యలకు క్రేనియోటమీ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక ఆసుపత్రి వసతి, ఎక్కువ రికవరీ సమయం అవసరమయ్యేది. అయితే జాప్-ఎక్స్ సాంకేతికతతో శస్త్రచికిత్స అవసరం లేకుండానే అత్యంత ఖచ్చితమైన రేడియేషన్ కిరణాలతో ట్యూమర్లను లక్ష్యంగా చేసుకొని చికిత్స అందించవచ్చు.
ఈ సిస్టమ్ సబ్-మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో రేడియేషన్ కిరణాలను పంపి ట్యూమర్ లేదా అసాధారణ కణజాలాన్ని మాత్రమే లక్ష్యంగా చేస్తుంది. ఆరోగ్యకరమైన మెదడు భాగాలకు హాని కలగకుండా చికిత్స చేయడం దీని ప్రత్యేకత. నొప్పి లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా, ఒకరోజు డే-కేర్ విధానంలోనే చికిత్స పూర్తి చేయవచ్చు. చికిత్స అనంతరం రోగులు త్వరగా సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది.
జాప్-ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను మెదడులోని వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించవచ్చు. బెనైన్ ట్యూమర్లు అయిన మెనింజియోమా, ఆకౌస్టిక్ న్యూరోమా వంటి సమస్యలతో పాటు మాలిగ్నెంట్ ట్యూమర్లు, మెదడులో రక్తనాళాల లోపాలు, ట్రైజెమినల్ న్యూరాల్జియా వంటి తీవ్రమైన నరాల నొప్పి సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక వైద్య సాంకేతికతను రోగులకు అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని తెలిపారు. ఒకప్పుడు క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స అవసరమైన అనేక పరిస్థితులను ఇప్పుడు అధిక ఖచ్చితత్వంతో, కోతలు లేకుండా చికిత్స చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సాంకేతికత రోగులు, కుటుంబ సభ్యులపై శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, సమీప రాష్ట్రాల రోగులకు కూడా ఈ సాంకేతికత ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.
న్యూరో సర్జన్ జాన్ ఆర్. అడ్లెర్ మాట్లాడుతూ, ఆధునిక వైద్యం కనిష్టంగా ఇన్వాసివ్ విధానాలపై దృష్టి సారిస్తోందని చెప్పారు. మెదడులోని అనేక వ్యాధులను ముందుగా ఓపెన్ సర్జరీ ద్వారా మాత్రమే చికిత్స చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు జాప్-ఎక్స్ ద్వారా సంక్లిష్ట రేడియోథెరపీ విధానాలను సులభతరం చేయవచ్చని వివరించారు. న్యూరోసర్జన్లు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూరోరేడియాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులతో కూడిన బహుశాఖ వైద్య బృందం సమన్వయంతో చికిత్స ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు.గత మూడు దశాబ్దాల్లో రేడియోసర్జరీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు.
ఈ ఆధునిక వ్యవస్థ రాకతో హైదరాబాద్ దేశంలోనే అత్యాధునిక వైద్య సాంకేతిక కేంద్రంగా మరింత గుర్తింపు పొందనుంది. శస్త్రచికిత్స అవసరం లేకుండా, నొప్పిలేని చికిత్స అందించే ఈ ప్లాట్‌ఫారమ్ వేలాది మంది రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అందించగలదని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో జాప్-ఎక్స్ దేశంలో మొదటిసారి ప్రవేశపెట్టబడింది.
