
‘దక్షిణాది’అభివృద్ధికి సమన్వయంతో సాగాలి: సీఎం చంద్రబాబు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతోనే ప్రాంతీయ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, మౌలిక వసతులు, నదీ జలాల అనుసంధానం, రవాణా, విద్యుత్, పర్యాటకం తదితర అంశాలపై చంద్రబాబు ప్రసంగించారు.
బుల్లెట్ ట్రైన్ కారిడార్
ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపి అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రైపోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలని కోరారు. యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
విపత్తుల సమయంలో పరస్పర సహకారం
ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునేందుకు మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందని, 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
విభజన సమస్యలను పరిష్కరించాలి
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా పూర్తిస్థాయిలో విభజనకు నోచుకోలేదని, విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయని చెప్పారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వనరుల లోటు, విభజన చట్టంలోని సెక్షన్ 56కు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని, విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కూడా కేంద్ర అనుమతులు ఇవ్వాలని కోరారు.
గోదావరి–కావేరి అనుసంధానంపై ప్రతిపాదన
గోదావరి–కావేరి నదుల అనుసంధానం ద్వారా 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ అనుసంధానం తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలదని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు నదీ జలాల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమని అన్నారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
