
థానేలో రికార్డు స్థాయిలో మత్తు పదార్థాల పట్టివేత
ముంబ్రాలో అంతర్‌రాష్ట్ర మత్తు పదార్థాల సరఫరా ముఠాను పోలీసులు ఛేదించారు.రూ.27.21 కోట్ల విలువైన 13.629 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. థానే పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ఒకే పోలీస్ స్టేషన్ స్థాయిలో ఇది ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ డ్రగ్స్ పట్టివేతగా అధికారులు పేర్కొన్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారంతో ముంబ్రా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎన్‌డీపీఎస్ (ఎన్డీపీఎస్) స్క్వాడ్, ఒక ఆసుపత్రి సమీప ప్రాంతంలో గస్తీ కాసి బాసు ఉమర్దిన్ సయ్యద్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 23.5 గ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జోన్–1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుభాష్ బుర్సే తెలిపారు.విచారణలో మధ్యప్రదేశ్ నుంచి థానే వరకు విస్తరించిన సరఫరా గొలుసు ఉన్నట్టు వెల్లడైందని ఆయన చెప్పారు. సయ్యద్ విచారణ ఆధారంగా, మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్ సింగ్ అమర్ సింగ్ గుజ్జర్ (40) కైలాష్ శంభూలాల్జీ బాలై (36)లను సరఫరాదారులుగా గుర్తించినట్లు తెలిపారు. గుజ్జర్, బాలై వద్ద నుంచి రూ.7.30 కోట్ల విలువైన 3.51 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
అనంతరం ముంబ్రా పోలీసుల ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్‌లోని రట్లాం పట్టణానికి వెళ్లి, మరో ఇద్దరు సరఫరాదారులైన మనోహర్ లాల్ రంగ్‌లాల్ గుజ్జర్, రియాజ్‌మొహమ్మద్, సుల్తాన్‌మొహమ్మద్ మన్సూరి అలియాస్ రాజులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.19.91 కోట్ల విలువైన 9.95 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో మొత్తం పట్టుబడ్డ మెఫెడ్రోన్ పరిమాణం 13.629 కిలోలు, మొత్తం విలువ రూ.27.21 కోట్లుగా అధికారులు తెలిపారు.
ఇది థానే పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ఓ పోలీస్ స్టేషన్ స్థాయిలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్ పట్టివేతగా పేర్కొంటూ, ఇది ముంబ్రా పోలీస్ స్టేషన్‌కు గొప్ప విజయం అని డీసీపీ సుభాష్ బుర్సే తెలిపారు. అరెస్టైన ఐదుగురు కూడా హిస్టరీషీటర్లు కాగా, వారి పేర్లపై మునుపటి నుంచే ఎన్‌డీపీఎస్ చట్టం, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఆయుధాల చట్టం కింద కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన గణాంకాల ప్రకారం జనవరి 2024 నుంచి ఇప్పటివరకు ముంబ్రా పోలీస్ స్టేషన్ ఎన్‌డీపీఎస్ స్క్వాడ్ 954 ఆపరేషన్లలో రూ.48.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
