Let's talk: editor@tmv.in
త్వరలో ‘జంతర్‌ మంతర్‌ సీజన్‌–2’: సీజేపీ

త్వరలో ‘జంతర్‌ మంతర్‌ సీజన్‌–2’: సీజేపీ

Pinjari Chand
13 ఆగస్టు, 2026

విద్యార్థుల ఆందోళన తరహాలో మరో నిరసన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజే‌పీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. దీనికి ‘జంతర్‌ మంతర్‌ సీజన్‌–2’గా ఆయన అభివర్ణించారు. బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో దీప్కే మాట్లాడుతూ ‘జంతర్‌ మంతర్‌ సీజన్‌–2’ ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు అడుగుతున్నారని, త్వరలోనే రెండో దశ ఆందోళన ప్రారంభమవుతుందని తెలిపారు.

సమావేశానికి వేదిక దొరకలేదు

ఢిల్లీలో తమ పార్టీ కార్యకర్తల సమావేశానికి వేదికను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించగా.. పలువురు హాల్‌ యజమానులు ‘పై నుంచి ఒత్తిడి ఉంది’ అంటూ హాళ్లు ఇవ్వడానికి నిరాకరించారని దీప్కే ఆరోపించారు. చివరకు ఒక హాల్‌ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, సమావేశానికి అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ హాల్‌ యజమానులను బెదిరించినట్లు ఆరోపించారు. ఈ బెదిరింపుల వెనుక బీజేపీ ఉందని దీప్కే ఆరోపించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. దేశ యువత పట్ల బీజేపీ భయపడుతోందని ఆయన విమర్శించారు.

37 రోజుల పాటు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన

సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద గతంలో 37 రోజులపాటు విద్యార్థుల నిరసన కొనసాగింది. జూలై 25న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం, ఇతర ప్రధాన డిమాండ్లపై హామీ లభించడంతో ఆందోళనను విరమించారు.

దేశవ్యాప్తంగా ‘లిజనింగ్‌ టూర్‌’

దీప్కే ‘జంతర్‌ మంతర్‌ సీజన్‌–2’ ప్రకటనపై పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, అధికారుల తీరుపై నిరసనలు కొనసాగుతున్నాయని, దీనినే తమ ‘సీజన్‌–2’గా భావిస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ‘లిజనింగ్‌ టూర్‌’ చేపట్టనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నుంచి విద్యా రంగ సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.

త్వరలో ‘జంతర్‌ మంతర్‌ సీజన్‌–2’: సీజేపీ - Tholi Paluku