

తెలుగు రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
తెలంగాణలో వాతావరణ సమాచారం
తెలంగాణపై అల్పపీడన ప్రభావం కారణంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో వర్షాలు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 70 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12న వర్ష అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ప్రభావం తక్కువగా ఉంటుంది. అక్కడ కేవలం కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ సమాచారం
ఉత్తర బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 12 శుక్రవారం, సెప్టెంబర్ 13 శనివారాల్లో ఉత్తర కోస్తాంధ్రా, యానాం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే సెప్టెంబర్ 14 వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
