
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి: జర్మనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్పాదక రంగ పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జర్మనీకి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
జర్మనీలోని బవేరియన్ ఆర్థిక, ప్రాంతీయ అభివృద్ధి, ఇంధన మంత్రిత్వ శాఖ వైస్ మినిస్టర్ టోబియాస్ గోథార్డ్ నేతృత్వంలోని ఈ బృందంతో జరిగిన భేటీలో తెలంగాణ-జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నైపుణ్యం కలిగిన మానవ వనరులతో తెలంగాణను అంతర్జాతీయ ఉత్పాదక హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రతినిధి బృందానికి వివరించారు.
లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ రంగం, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, సెమీకండక్టర్లు, ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ హెల్త్, పరిశోధన, ఆవిష్కరణలు, స్వచ్ఛ ఇంధనం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఇండస్ట్రీ 4.0 వంటి రంగాల్లో తెలంగాణలో విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమగ్ర పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు. పెట్టుబడులకే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ తెలంగాణ–జర్మనీ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్, హైదరాబాద్‌లోని జర్మనీ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్, బవేరియన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉల్రికే హాఫ్మన్, బవేరియా ఇండియా ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ కొట్టాయిల్ తదితరులు పాల్గొన్నారు.
