
తెలంగాణలో క్రీడారంగాన్నిఅంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మౌలిక వసతుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చేలా అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
క్రీడాశాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, అన్ని రకాల క్రీడలకు అవసరమైన మైదానాలు, శిక్షణా కేంద్రాలు, ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఇదే సందర్భంగా గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియాన్ని పునర్నిర్మించి ఆధునికీకరించాలని సీఎం ఆదేశించారు. స్టేడియం ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడలకు ప్రత్యేక మైదానాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతిపాదిత నిర్మాణాలకు సంబంధించిన పలు ఆర్కిటెక్చర్ నమూనాలను పరిశీలించి అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు.
భవిష్యత్తులో తెలంగాణను ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు వేదికగా నిలిపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించేలా మరింత ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు.
అలాగే కొట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్‌బీ స్టేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునికీకరించాలని అధికారులకు ఆదేశించారు.
పోలీసు శాఖకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
మారుతున్న కాలానికి అనుగుణంగా, రాబోయే 25 ఏళ్ల సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన 'పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాబోయే 25 సంవత్సరాలకు కావలసిన పోలీసింగ్ విధానాలపై చర్చించి ప్రణాళికలు రూపొందించడానికి పోలీసు అధికారులను ప్రేరేపించారు. పోలీసు ఉన్నతాధికారులు వివిధ విభాగాల పరిపాలనా, సాంకేతిక, న్యాయ, ఆర్థిక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకి వివరించారు. భవిష్యత్తులో పోలీసింగ్‌లో చేపట్టాల్సిన మార్పులు, ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యల అవసరాన్ని సీఎం గుర్తించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయడం, నేరాలను అరికట్టడంలో ఏఐ టెక్నాలజీని వినియోగించడం కీలకం అని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా ఆవిష్కరించారు.
సీఎం మాట్లాడుతూ, శాంతి భద్రతలను కాపాడటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మంచి గుర్తింపు పొందింది. అయితే 2047 లక్ష్యాలను చేరుకోవడానికి పోలీస్ శాఖను ఎంపవర్ చేయడం అత్యవసరం అని అన్నారు. భవిష్యత్తులో పోలీసింగ్ విధానాలకు చట్టబద్ధత కల్పించడానికి సీఎం నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆర్థిక, న్యాయ, సాంకేతిక అంశాలపై చర్చించిన తరువాత చట్ట రూపం తీసుకుంటామని తెలిపారు.
పోలీసు శాఖకు అవసరమైన నిధులు కేటాయించడంలో ఇబ్బంది లేదని, కానీ ఫలితాలను గమనించే విధంగా ఆ నిధులు వినియోగించాలన్న విశ్వాసాన్ని సృష్టించాలి అని సీఎం అన్నారు. అలాగే, ఫిజికల్ క్రైమ్ పరిష్కారానికి మాన్యువల్స్ రాసినప్పటికీ, కొత్త సైబర్, డ్రగ్స్ సమస్యలతో ఎదుర్కోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పోలీసు అధికారులు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవడమే సమస్యను వేగంగా పరిష్కరించడానికి కీలకమని, ఉద్యోగం వచ్చినందున సౌకర్యం పట్ల సడలింపు వద్దని సీఎం హెచ్చరించారు. మెట్రోపాలిటన్ నగరాల పరిస్థితులను గమనించి అవి పోలీస్ శాఖకు నేర్చుకోవలసిన పాఠాలని, అలాగే సిబ్బంది రేషనలైజేషన్, మానవ వనరుల సమర్థ వినియోగం కీలకమని చెప్పారు.
తదుపరి చర్యలలో (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) కంట్రోల్ రూమ్‌తో సాంకేతిక డేటాను కనెక్ట్ చేసి, ఏ పోలీస్ స్టేషన్‌లో అవసరమైన సమాచారాన్ని నిమిషాల్లో అందించే విధంగా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందితో అనుసంధానం ఏర్పాటు చేయగలిగితే, కింద స్థాయి సమస్యలను సులభంగా అర్థం చేసుకోవచ్చని, పోలీస్ శాఖ మానవీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని సీఎం అన్నారు. 2002 సంవత్సరంలో పోలీస్ రిట్రీట్ కార్యక్రమం తర్వాత ఇప్పుడు మళ్లీ రిట్రీట్ జరుపుకుంటున్నామని, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నేరాలు, నేరాల స్వరూపం చర్చించుకుని అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుందని దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, అభిలాషా బిష్త్ తదితరులు పాల్గొన్నారు.
