
తెలంగాణలో కీలక పదవుల భర్తీ.. పలువురికి కొత్త బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం పలు కీలక సంస్థలు, కార్పొరేషన్లకు నూతన ఛైర్‌పర్సన్‌లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ ఈ మేరకు జీఓలు విడుదల చేశారు.
ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఓ ఆర్టీ నెం. 1289ను జారీ చేసింది. విజయలక్ష్మికి కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సేవలందించిన గద్వాల విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేయడంతో, ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం నేరెళ్ల శారదను నూతన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ జీఓ ఆర్టీ నెం. 1290 విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
'కుడా' ఛైర్‌పర్సన్‌గా జి. సుధారాణి
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ జీఓ ఆర్టీ నెం. 1291 ద్వారా ఈ నియామక ఉత్తర్వులు ఇచ్చింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. నియామకానికి సంబంధించిన ఇతర నిబంధనలను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేకంగా జారీ చేయనుంది. ఒకేసారి మూడు కీలక పదవుల్లో మార్పులు, కొత్త నియామకాలు చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
