
తెలంగాణలో ‘ఎస్ఐఆర్’ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కీలక ప్రక్రియల గడువులను పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ లేఖ పంపింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి ధృవీకరణ కార్యక్రమం జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు కొనసాగనుంది. ఆగస్టు 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించనున్నట్లు తెలిపింది.
ముసాయిదా ఓటరు జాబితాను ఆగస్టు 10న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసులు జారీ చేయడం, వాటి పరిష్కార ప్రక్రియ ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది.
అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ గురించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కమిషన్ ఆదేశించింది. అలాగే రాజకీయ పార్టీలకు కూడా లిఖితపూర్వకంగా కొత్త షెడ్యూల్ వివరాలను తెలియజేయాలని సూచించింది. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజా సవరణతో అన్ని దశల గడువులు పొడిగించబడ్డాయి. అటు ఏపీలో ఇప్పటికే సర్ గడువును ఈనెల 24 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
