
తెలంగాణలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం "అప్రకటిత ఎమర్జెన్సీ" నడుస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, 22ఏ భూ అక్రమాలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీజేవైఎం నాయకులతో కలిసి తాము సచివాలయానికి వెళ్లామని తెలిపారు. అయితే, సచివాలయం ప్రధాన గేటు వద్దే పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్ చేశారని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. మూడు రోజుల వ్యవధిలోనే పోలీసులు తనను రెండోసారి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు.
ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరడమే నేరమా? ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా? వీరు తెలంగాణ పోలీసులా లేక కాంగ్రెస్ పోలీసులా? అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. పోలీసు అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, కానీ ఇటువంటి అరెస్టులకు తమ పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
