
తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శలు
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించిన 'తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ - 2026' నివేదికపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నివేదిక ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతుందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఈ నివేదికను చెత్తబుట్టలో వేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా కమిషన్ చైర్మన్ మురళి సీఎంకు నివేదిక సమర్పించారని, ఇందులో పదేళ్ల మాజీ సీఎం కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని పేర్కొనడం తగదన్నారు. లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రిపోర్టు ఉందని విమర్శించారు. ఉపాధ్యాయుల జీతాలను నిర్ణయించే అధికారం పీఆర్సీదే కాని విద్యా కమిషన్‌ది కాదని పేర్కొన్నారు.
‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం ద్వారా రూ.7,900 కోట్లతో 25 వేల పాఠశాలలను అభివృద్ధి చేశామని, గురుకులాల విస్తరణ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, స్పోర్ట్స్ అకాడమీలు కేసీఆర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు భారీగా జీతాలు పెంచిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన తెలిపారు.
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎంట్రన్స్ రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని సిఫార్సు చేయడం గ్రామీణ విద్యార్థులకు నష్టమని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయాలనే సూచన పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాలను క్రమంగా రద్దు చేయాలని నివేదికలో సూచించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళా డిగ్రీ గురుకులాలు దేశంలోనే మొదటిసారిగా ప్రారంభమై మంచి ఫలితాలు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.
పబ్లిక్ స్కూళ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో సరిగా లేనిదని అంగన్వాడీ కేంద్రాలను ప్రీ-ప్రైమరీ పేరిట బంద్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యా కమిషన్ నివేదిక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కాపీ-పేస్ట్ చేసినట్లుందని ఆయన విమర్శించారు. ఈ నివేదిక అమలైతే తెలంగాణ విద్యా వ్యవస్థ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని, రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
