Let's talk: editor@tmv.in
తెలంగాణ రైతన్నకు ఈ నెల 22 నుంచి రైతుభరోసా

తెలంగాణ రైతన్నకు ఈ నెల 22 నుంచి రైతుభరోసా

Gaddamidi Naveen
16 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద నిధులను ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మొదటి విడతగా ఈ నెల 22న సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు సంబంధించిన రూ.3,590 కోట్ల నిధులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తరువాత సుమారు 20 రోజుల వ్యవధిలో రెండో విడతగా రూ.2,650 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే మిగిలిన రైతులకు సంబంధించిన నిధులను ఏప్రిల్ నెలాఖరులోగా వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అన్ని మతాలు సోదరభావంతో మెలగాలి

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ వేళ, రాష్ట్రంలోని అన్ని మతాల వారు సోదరభావంతో కలిసికట్టుగా ఉండి తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రంజాన్ మాసం కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా విలువలను గుర్తు చేసే పవిత్ర కాలమని అన్నారు. నెల రోజుల పాటు ఆత్మశుద్ధితో ఉపవాసం ఉండటం, పరులకు సహాయం చేయడం, సత్సంబంధాలను పెంపొందించుకోవడం రంజాన్ మాసం యొక్క అసలైన సందేశమని తెలిపారు. సమాజంలో పరస్పర గౌరవం, సహనం, సోదరభావం పెంపొందించడానికి ఈ పవిత్ర మాసం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ పరస్పర గౌరవంతో కలిసి పనిచేస్తే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం చెప్పారు. ప్రజల ఐక్యతే రాష్ట్ర ప్రగతికి ప్రధాన బలం అని ఆయన పేర్కొన్నారు.

మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట

మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే క్రమంలో క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం,మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు డీఎస్పీ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారికి రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా మైనారిటీలకు చెందిన షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి కల్పించడంతో పాటు పలువురు నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించి వారికి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.

అదనంగా, విద్యా రంగంలో కూడా మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకంలో మైనారిటీలకు తగిన వాటా ఇస్తున్నామని, ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల నిర్మాణంలో మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. మైనారిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

అందరి ప్రభుత్వం - అందరి బాధ్యత

ఈ ప్రభుత్వం మనందరిదీ. నేను మీ ఇంట్లోని ఒక సోదరుడిని. మనమందరం కలిసి కష్టపడితేనే హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతాయి. ఈ అభివృద్ధి యజ్ఞంలో మీ అందరి సహకారం కావాలని సీఎం పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వేలాది మంది మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైతన్నకు ఈ నెల 22 నుంచి రైతుభరోసా - Tholi Paluku