
తెలంగాణ 'ఫ్యామిలీ రిజిస్టర్' ప్రారంభం.. మీసేవ ద్వారా ధ్రువపత్రాల జారీ
రాష్ట్రంలో పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు కుటుంబ వివరాల పరిశీలనలో పారదర్శకత తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ రూపంలో "తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్"ను ఏర్పాటు చేస్తూ, 'మీసేవ' పోర్టల్ ద్వారా 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్' (కుటుంబ ధ్రువీకరణ పత్రం) పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఒక ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ ప్రభుత్వ పథకాలు, సేవలను పొందడానికి పౌరులు తమ కుటుంబ వివరాలకు సంబంధించి ప్రామాణికమైన పత్రాలను సమర్పించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ రూపంలో నిర్వహించబడే ఈ ఫ్యామిలీ రిజిస్టర్‌లో ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక 'ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్' ఉంటుంది. ఇందులో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లు, యజమానితో వారి సంబంధం, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, సభ్యుల ఐడీ/గుర్తింపు వివరాలు ప్రస్తుత చిరునామా నమోదు చేయబడతాయి.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వాగతం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ (సర్) ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించడం సరైన సమయాన తీసుకున్న నిర్ణయమని కొనియాడారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్' లో స్పందించారు.
ఈ అంశంపై తాను కాంగ్రెస్ నాయకుడు ఫహీమ్ ఖురేషీతో కలిసి ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించినట్లు ఓవైసీ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ సందర్భంగా గుర్తింపుకు అనుమతించే 12 ధ్రువీకరణ పత్రాల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కూడా ఒకటిగా పరిగణించబడుతుందని చెప్పారు. నోటీసులు అందుకునే పేదలు, సరైన పత్రాలు లేని ప్రజలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఫ్యామిలీ రిజిస్టర్ అమలుతో ప్రభుత్వ సేవల కోసం కుటుంబ వివరాల ధృవీకరణ మరింత సులభంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
