Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
తీర ప్రాంతాల్లోనూ ‘వైబ్రెంట్‌ విలేజ్‌’ పథకం

తీర ప్రాంతాల్లోనూ ‘వైబ్రెంట్‌ విలేజ్‌’ పథకం

Shaik Mohammad Shaffee
19 జనవరి, 2026

దేశ సరిహద్దు గ్రామాల్లో అమలవుతున్న 'వైబ్రెంట్‌ విలేజెస్ ప్రోగ్రాం’ (వీవీపీ) తరహాలోనే, త్వరలో 'కోస్టల్ వైబ్రెంట్‌ విలేజెస్' పథకాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. భారత్‌కున్న సుమారు 6,500 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలతో మమేకమవ్వడం, తీర రక్షణలో వారిని భాగస్వామ్యం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ప్రవీణ్ రంజన్ సోమవారం వెల్లడించారు.

తీర భద్రతపై ప్రత్యేక దృష్టి

సముద్ర తీర భద్రతకు కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డీజీ తెలిపారు. 2025లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన డీజీ/ఐజీల సదస్సులో ప్రధాని మోడీ సైతం తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారని గుర్తు చేశారు. సముద్ర తీరాలు చాలా సున్నితంగా ఉంటాయని, అందుకే అన్ని ఏజెన్సీలతో కలిసి క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే సీఐఎస్‌ఎఫ్ 52 తీర ప్రాంత గ్రామాలను దత్తత తీసుకోనుంది.

సముద్ర తీర సైక్లోథాన్‌

తీరప్రాంత ప్రజల్లో అవగాహన పెంచేందుకు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు రెండో విడత 'కోస్టల్ సైక్లోథాన్‌' నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్ రంజన్ ప్రకటించారు. గత ఏడాది నిర్వహించిన మొదటి విడత ఘన విజయం సాధించిందని, దీనివల్ల క్షేత్రస్థాయిలో విలువైన సమాచారం సేకరించగలిగామని తెలిపారు. ఓఎన్‌జీసీ, పోర్ట్స్ అథారిటీ వంటి సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో దత్తత గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.

విమానాశ్రయాల తరహాలో ఓడరేవుల భద్రత

దేశంలోని ప్రధాన ఓడరేవుల భద్రతను విమానాశ్రయాల స్థాయికి పెంచుతున్నట్లు సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఇందుకోసం 'హైబ్రిడ్ మోడల్'ను అమలు చేయనున్నారు. ఈ విధానం ప్రకారం, కీలకమైన రక్షణ బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తుండగా, ఇతర సాధారణ పనులను ప్రైవేట్ సిబ్బందికి అప్పగిస్తారు. ఓడరేవుల భద్రతను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు సుమారు 10,000 నుంచి 12,000 మంది సిబ్బందితో ఒక ప్రత్యేక విభాగాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు, సీఐఎస్‌ఎఫ్‌కు 'రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్' హోదా లభించడంతో ఓడరేవుల భద్రతకు సంబంధించిన ప్రణాళికలు, శిక్షణ బాధ్యతలను ఇకపై ఈ బలగాలే స్వయంగా పర్యవేక్షిస్తాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో 'బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ' అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ చర్యల ద్వారా సముద్ర మార్గంలో జరిగే వాణిజ్యానికి మరింత పటిష్టమైన రక్షణ కవచం లభించనుంది.

ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక..

భారతదేశ విదేశీ వాణిజ్యంలో 95 శాతం (పరిమాణం పరంగా), 70 శాతం (విలువ పరంగా) సముద్ర మార్గం ద్వారానే జరుగుతోంది. దేశ జనాభాలో సుమారు 18 శాతం మంది తీరప్రాంత జిల్లాల్లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని 230 ఓడరేవుల్లో 78 ఎగుమతి, దిగుమతుల కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 12 ప్రధాన ఓడరేవులకు సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తోంది.

తీర ప్రాంతాల్లోనూ ‘వైబ్రెంట్‌ విలేజ్‌’ పథకం - Tholi Paluku