
‘తల్లికి వందనానికి పంగనామం.. బిడ్డలకు ఎగనామం’: వైఎస్ షర్మిల
‘తల్లికి వందనం’ పథకం అమలులో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నీరుగార్చిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం ‘అమ్మఒడి’ పేరుతో తల్లులను మోసం చేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరిట బిడ్డలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ వారసుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారారని, గత ప్రభుత్వ విధానాలనే కొత్త పేర్లతో కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన షర్మిల.. ‘‘తల్లికి వందనానికి పంగనామం.. బిడ్డలకు ఎగనామం’’ ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల అసలు రూపమని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక కోతలు, నిబంధనలతో లబ్ధిదారులను తగ్గిస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని చెప్పిన ప్రభుత్వం కేవలం 67 లక్షల మందికే పథకాన్ని వర్తింపజేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులను పథకం నుంచి దూరం చేయడం వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు.
రూ.15 వేల సాయం అందిస్తామని ప్రకటించి పాఠశాల అభివృద్ధి పేరుతో రూ.2 వేల కోత విధించడం ప్రజలను మభ్యపెట్టడమేనని షర్మిల ఆరోపించారు. గతంలో విద్యుత్ వినియోగం, వాహనాలు, ఇతర నిబంధనల పేరుతో అర్హులను అనర్హులుగా చేయడాన్ని తప్పుబట్టిన చంద్రబాబే ఇప్పుడు 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, కార్లు, భూముల పేరుతో కొత్త కొర్రీలు పెట్టడం విడ్డూరమన్నారు.
తల్లికి వందనం పథకంపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే యూడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 87 లక్షల మంది విద్యార్థులందరికీ ఎలాంటి కోతలు లేకుండా రూ.15 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పథకానికి దూరమైన సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు కూడా ప్రయోజనం కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ తరఫున లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
