
డ్వాక్రా సంఘాల్లో అవినీతికి తావులేదు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు పారదర్శకంగా సాగాలని, మహిళలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికలని, అలాంటి వ్యవస్థలో అక్రమాలు, అవినీతికి ఎలాంటి అవకాశం ఉండకూడదని పేర్కొన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, రిసోర్స్ పర్సన్స్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా సంఘాల పనితీరు, మహిళలకు అందుతున్న రుణాలు, వాయిదాల చెల్లింపులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారత కోసం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన డ్వాక్రా వ్యవస్థ లక్షలాది మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిందన్నారు. ఈ వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఇటీవల కొందరు డ్వాక్రా మహిళలు రుణాల మంజూరు, వాయిదాల చెల్లింపుల విషయంలో కింది స్థాయి సిబ్బంది, మధ్యవర్తుల అక్రమాలపై ఫిర్యాదులు చేశారని తెలిపారు. రుణాలు ఇప్పిస్తామంటూ కమిషన్లు వసూలు చేయడం, మహిళల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. డ్వాక్రా మహిళలకు అందే ప్రతి రూపాయి వారి అభివృద్ధికే ఉపయోగపడాలని, రుణాల మంజూరు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. గుంటూరు పశ్చిమలో అవినీతి రహిత మెప్మా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మహిళలు నేరుగా తనను సంప్రదించాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
