
‘డ్యూడ్’ బాక్సాఫీస్ జోరు
ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన ‘డ్యూడ్’ సినిమా కలెక్షన్ల జోరు, ఆడియన్స్ హుషారు, బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజు భారత్‌లో రూ. 9.75 కోట్లు రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు రూ. 10 కోట్లు సాధించి, మొత్తం రూ. 19.75 కోట్ల దేశీయ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. తమిళనాడులో రెండో రోజు రూ. 7.25 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 2.75 కోట్లు వసూలయ్యాయి. తమిళనాడులో 55.43%, తెలుగు రాష్ట్రాల్లో 43.43% ఆక్యుపెన్సీ రికార్డైంది. దీపావళి సెలవుల కారణంగా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘లవ్ టుడే’ తరహాలో ఉత్సాహవంతమైన రొమాంటిక్ కామెడీగా ‘డ్యూడ్’ ఆకట్టుకుంటున్నప్పటికీ, కథనంలో కొంత వైవిధ్యం, మేకింగ్ లో కాస్త మార్పులు ఉండాల్సిందని, సెకండ్ హాఫ్ స్లో గా కొనసాగినట్లు కనిపిస్తుందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. మొదటి సగం సరదాగా, హాస్యంతో ఆకర్షణీయంగా సాగినా, రెండో సగంలో కొంత నెమ్మదిగా ఉన్నట్టు ప్రేక్షకులు ఎక్స్ వేదికగా కామెంట్లు, పోస్టులతో పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా ఒకసారి చూడదగినదని అంటున్నారు.
ప్రదీప్ రంగనాథన్‌తో పాటు మమితా బైజు, ఆర్. సారథ్‌కుమార్, రోహిణి, హృదు హరూన్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, ప్రేమ, వ్యక్తిగత ఆశలు, సామాజిక అంచనాల మధ్య సాగే ఒక యువకుడి ప్రయాణం పై ఆధారపడింది. కథలో కొన్ని అంశాల మధ్య కనెక్షన్ సరిగ్గా కలవలేదని విమర్శలు ఉన్నాయి. ప్రదీప్ తన సహజ నటన, కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మమితాతో ప్రదీప్ కెమిస్ట్రీ బాగుంది. సారథ్‌కుమార్, హృదు హరూన్ తమ పాత్రల్లో సమర్థవంతంగా కనిపించారు. పండుగ సీజన్‌లో సరదాగా ఆస్వాదించే చిత్రంగా ‘డ్యూడ్’ నిలుస్తుంది. ఇక ఈ మూవీ సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకుంటూ మూవీ టీం సింహాచలం లో స్వామి వారిని దర్శించుకొని, కాసేపు థియేటర్ లో సందడి చేసారు, ఆ తరువాత ఆడియన్స్ తో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. చూడాలి, ఈ డ్యూడ్ సినిమాకు ఇంకెన్ని కోట్లు కలెక్షన్ వస్తుందో మరి.