Let's talk: editor@tmv.in
డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.20 లక్షలకు విక్రయించారు: ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌

డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.20 లక్షలకు విక్రయించారు: ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌

Pinjari Chand
21 ఆగస్టు, 2026

మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆరోపించారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చకు ప్రభుత్వం తగిన సమయం కేటాయించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తుందని తెలిపారు. అసెంబ్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. ఒక్కో పోస్టును రూ.20 లక్షలకు పైగా విక్రయించారని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. డీఎస్సీ నియామకానికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందని విమర్శించారు. ‘ప్రజల తరఫున పోరాడతాం. గొంతు లేని వారికి గొంతుకగా నిలుస్తాం. డీఎస్సీ అంశంపై చర్చించేందుకు శాసనమండలిలో తగినంత సమయం కేటాయించాలని డిమాండ్‌ చేస్తాం’ అని రమేష్‌ యాదవ్‌ అన్నారు.

బీసీ రిజర్వేషన్లపైనా..

అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యాఖ్యలపై కూడా రమేష్‌ యాదవ్‌ స్పందించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామని తెలిపారు. అయితే టీడీపీకి చెందిన కొందరు నేతలు ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేశారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు పార్టీలో 50 శాతానికి పైగా ప్రాతినిధ్యం కల్పించారని, జనరల్‌ కేటగిరీకి చెందిన కొన్ని స్థానాలను బీసీ స్థానాలుగా మార్చారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా నియమించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలను కేవలం రాజకీయంగా ఉపయోగించుకుంటోందని, బీసీ సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు.

బీసీ నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి

2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఇద్దరు బీసీ నేతలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించి, బీసీల సంక్షేమం కోసం పనిచేయించిందని రమేష్‌ యాదవ్‌ అన్నారు. ‘బీసీల సంక్షేమంపై ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక బీసీ నేతను డిప్యూటీ సీఎంగా నియమించాలి. దీనిపై చర్చకు రావాలి’ అని ఆయన సవాల్‌ విసిరారు.

డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.20 లక్షలకు విక్రయించారు: ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ - Tholi Paluku