
డీఎస్సీలో ఎక్కడా డీవియేషన్ లేదు : సీఎం చంద్రబాబు
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని, మెరిట్-కమ్-రోస్టర్ విధానంలోనే 15,941 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశామని తెలిపారు. డీఎస్సీపై వైసీపీ నేతలు హిట్ అండ్ రన్ తరహాలో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం శాసనసభలో మెగా డీఎస్సీ నియామకాలపై మాట్లాడిన సీఎం.. ధైర్యముంటే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ చేశారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే విద్యార్థులను అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దవచ్చన్నది తమ ప్రభుత్వ విధానమని చంద్రబాబు అన్నారు. విద్యారంగాన్ని టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహించిందని, ఎన్టీఆర్ హయాంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, మహిళా యూనివర్సిటీ వంటి సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. తాను తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మండలానికి జూనియర్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు.
2019-24 మధ్య టీచర్ నియామకాలు చేపట్టకుండా గత పాలకులు విద్యారంగంపై గొప్పలు చెప్పుకున్నారని సీఎం విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన 14 డీఎస్సీల్లో టీడీపీ, ఎన్డీయే ప్రభుత్వాల హయాంలోనే 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చామని తెలిపారు.
148 రోజుల్లోనే మెగా డీఎస్సీ పూర్తి
అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీ ద్వారా 15,941 పోస్టులను భర్తీ చేశామని చంద్రబాబు చెప్పారు. కేవలం 148 రోజుల్లోనే మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లతో పాటు వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేశామని వివరించారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నలను రూపొందించి, 154 కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేశామని, జోనల్, రాష్ట్రస్థాయి కమిటీలతో పాటు అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేసి అభ్యంతరాలను పరిష్కరించామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలనే అమలు చేశామని స్పష్టం చేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఒక్క డీవియేషన్ కూడా లేదని చంద్రబాబు అన్నారు. కొందరు వ్యక్తులు, మాజీ అధికారులు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు వందలాది కేసులు దాఖలయ్యాయని, అయినప్పటికీ అన్ని న్యాయపరమైన సవాళ్లను అధిగమించి నియామకాలను పూర్తి చేశామని తెలిపారు.
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు సీఎం సవాల్ విసిరారు. ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని అన్నారు. అసెంబ్లీలో చర్చిస్తే తమ ఆరోపణలు నిలబడవనే భయంతోనే వైసీపీ నేతలు బయట మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, కుట్రలు చేసే పార్టీలకు కాదని అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తి పారదర్శకతతో నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు భవిష్యత్‌లో పరీక్షల నిర్వహణలోనూ మరింత పారదర్శకత తీసుకొస్తామని తెలిపారు. వైసీపీ చాలా కాలంగా అసెంబ్లీకి హాజరుకాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని సీఎం అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సూచించారు.
