
డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన
డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, శాసనమండలిలో ఈ అంశంపై సమగ్ర చర్చకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు భరత్, అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. డీఎస్సీ నియామక ప్రక్రియలో ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించాలని, నైతిక బాధ్యతతో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై మండలిలో విస్తృత చర్చకు ప్రభుత్వం అనుమతించి, ప్రతిపక్షం లేవనెత్తిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని మండలిలో నిరంతరం లేవనెత్తుతూ, సమగ్ర విచారణ, బాధ్యత నిర్ధారణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు.
సీబీఐతో గ్రూప్–1 విచారణ జరిపించాలి
అంతకుముందు వైఎస్సార్‌సీపీ ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పి. చంద్రశేఖర్‌రెడ్డి డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఏపీపీఎస్సీ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెస్తోందని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంపై నిష్పక్షపాత దర్యాప్తునకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు అభ్యంతరం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రం లీకేజీ, ఉపాధ్యాయ పోస్టుల విక్రయం, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు, జీవో నంబర్లు 4, 47తో పాటు నియామక పత్రాల్లో అనంతరం చేసిన మార్పులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. స్పోర్ట్స్ సంఘాల ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లు, ఉద్యోగాల కోసం జరిగినట్లు ఆరోపిస్తున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలను సీసీ కెమెరాల నిఘా, బయోమెట్రిక్, ముఖ గుర్తింపు వంటి భద్రతా చర్యలతో పాటు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మాన్యువల్ మూల్యాంకనంతో నిర్వహించామని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఏపీపీఎస్సీపై అనుమానాలు ఉంటే దానిపైనా విచారణ జరపాలని, అయితే డీఎస్సీ-2025పై కూడా అదే స్థాయిలో దర్యాప్తు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
సమస్యలు చెప్పుకుంటే కూడా సస్పెండ్ చేస్తారా?
దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ఢిల్లీకి వెళ్లిన ఉపాధ్యాయ సంఘాల నేతలను సస్పెండ్ చేయడాన్ని కూడా ఆయన ఖండించారు. ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రం సమర్పించడం వారి ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొంటూ, సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టెట్ మినహాయింపుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను కూడా వైఎస్సార్‌సీపీ శాసనసభలో బలంగా ప్రస్తావిస్తుందని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగుల బకాయిలు సుమారు రూ.23 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు పెరిగాయని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలు, ఉపాధ్యాయుల సస్పెన్షన్లు, ఉద్యోగుల సమస్యలను శాసనసభలో గట్టిగా లేవనెత్తుతామని చెప్పారు. మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన చంద్రశేఖర్‌రెడ్డి.. డీఎస్సీ, ప్రభుత్వ నియామకాలు, ఉద్యోగుల ప్రయోజనాలు, అప్పులు, సంక్షేమం, జీఎస్‌డీపీ, అమరావతి, ల్యాండ్ పూలింగ్, మున్సిపల్ పరిపాలన తదితర అంశాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
