Let's talk: editor@tmv.in
డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధం: పేర్ని నాని సవాల్

డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధం: పేర్ని నాని సవాల్

Gaddamidi Naveen
29 జులై, 2026

డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాల అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీ స్కాంపై ఇప్పటికే ఆధారాలతో సహా ప్రజల ముందుకు వచ్చామని, వాటిపై సమాధానం చెప్పకుండా సవాళ్లు విసరడం సరైన విధానం కాదని విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాల అంశాన్ని తాము చాలా రోజుల క్రితమే బయటపెట్టామని తెలిపారు. డీఎస్సీ నియామకాల వెనుక జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, ‘డార్క్ ఆపరేషన్’కు సంబంధించిన వివరాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ముందుంచారని పేర్కొన్నారు. ప్రతి అంశానికి ఆధారాలు చూపించినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు వాటికి సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్‌ను చర్చకు రావాలని ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేశ్ పిలవడం అర్థరహితమని పేర్ని నాని అన్నారు. తాను కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేశానని, అందువల్ల డీఎస్సీ అంశంపై లోకేశ్‌తో చర్చించడానికి తానే సమాన స్థాయి వ్యక్తినని వ్యాఖ్యానించారు. “టైమ్, తేదీ, ప్లేస్ లోకేశ్ చెప్పినా సరే.. లేదా నన్ను చెప్పమన్నా సరే. డీఎస్సీ అక్రమాలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. నీకు సత్తా ఉంటే, ధైర్యం ఉంటే చర్చకు రా” అని పేర్ని నాని సవాల్ చేశారు. చంద్రబాబు వస్తే జగన్ వస్తారు. లోకేశ్ చర్చకు వస్తే నేనే వస్తా అంటూ వ్యాఖ్యానించారు.

మంత్రి లోకేశ్ డీఎస్సీ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన పేర్ని నాని, పార్టీ కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకోవడానికి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తన సవాల్‌పై లోకేశ్ స్పందించాలని, డీఎస్సీ అక్రమాలపై ప్రజల ముందే బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
DSCScamAPDSCNaraLokeshPerniNaniYSRCPAndhraPradeshPoliticalNewsAPPoliticsDSCIrregularitiesOpenChallengeYSJagan
డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధం: పేర్ని నాని సవాల్ - Tholi Paluku