Let's talk: editor@tmv.in
ట్రూ-డౌన్ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: మంత్రి గొట్టిపాటి రవికుమార్

ట్రూ-డౌన్ అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Gaddamidi Naveen
16 జులై, 2026

దేశంలో సాధారణంగా అదనపు విద్యుత్ భారాన్ని మోపే ట్రూ-అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ట్రూ-డౌన్ విధానాన్ని అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో వినియోగదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచకుండా విజయవంతంగా కొనసాగిస్తున్నామని, ఇప్పుడు మూడో ఏడాదిలోకి ప్రవేశించామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ, ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. బలమైన గాలులు, వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లకు తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నప్పటికీ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్ప వ్యవధిలోనే గాడిలో పెట్టారని పేర్కొన్నారు.

ట్రాన్స్‌కోను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించిన సుమారు రూ.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలవుతున్నాయని, నిర్ణీత గడువులో అన్ని కీలక పనులను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPNewsChandrababuNaiduNaraChandrababuNaiduGottipatiRaviKumarPowerSectorElectricityEnergyNewsPowerSupply