
ట్రంప్ పాలనపై అమెరికాలో నిరసన జ్వాలలు
అమెరికా అంతటా లక్షలాది మంది ప్రజలు శనివారం ట్రంప్ పాలనను, ఆయన నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చారు. నినాదాలతో, అరుపులతో, డప్పులతో వీధులను మార్మోగించారు. అమెరికాలో రాజులెవరు లేరు( నో కింగ్స్ ఇన్ అమెరికా) మా నగరాల్లో జోక్యం చేసుకోకండి, ఫాసిజాన్ని ఆపివేయండి అనే నినాదాలతో అమెరికా వీధులు హోరెత్తాయి. న్యూయర్స్ లో ఉన్న ప్రముఖ వాణిజ్య, వినోద కేంద్రమైన టైమ్ స్క్వేర్ దగ్గరకు కూడా నిరసనకారులు చేరుకుని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఈ నిరసనలు జరిగాయి. నగరాల్లో ఫెడరల్ దళాలను మోహరించడం, ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను పెంచడం, ప్రత్యర్థి సంస్థలపై దాడులు, ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ డీసీలో సుమారు 2 లక్షల మంది, చికాగోలో లక్ష మంది పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే అట్లాంటా, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్, బోస్టన్, పోర్ట్‌ల్యాండ్ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు విస్తృతంగా మద్దతు తెలిపారు. హార్వర్డ్ క్రౌడ్ కౌంటింగ్ కన్సర్టియం అంచనా ప్రకారం దాదాపు 2నుంచి 4.8 మిలియన్ల అమెరికన్లు దేశవ్యాప్తంగా నిరసనలో పాల్గొన్నట్లు వెల్లడించింది. 200కు పైగా సంస్థలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. ట్రంప్ ప్రభుత్వాన్ని రాజరికం వైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. పోర్ట్‌ల్యాండ్‌లో సంప్రదాయానికి అనుగుణంగా, కొందరు కప్పులు, యూనికార్న్లు, లాబ్‌స్టర్లు వంటి దుస్తులు ధరించి శాంతియుతంగా నిరసన చేశారు.మరి కొందరు ట్రంప్ ను హిట్లర్ లా పొలుస్తూ ఫాసిస్టులాగా చూపుతున్న వ్యంగమైన ఫోటోలను నిరసన కారులు ర్యాలీలో ప్రదర్శించారు.
ర్యాలీ సందర్భంగా కొంతమంది నాయకులు నిరసన కారులను ఉద్దేశించి మాట్లాడారు. మేం అమెరికాపై ప్రేమతో వీధుల్లో నిరసన తెలుపుతున్నాం. ద్వేషంతో కాదని బెర్నీ సాండర్స్ అన్నారు. రఫెల్ వార్నాక్ మాట్లాడుతూ సైన్యం ప్రజలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బ్రాండన్ జాన్సన్ (చికాగో మేయర్) ప్రసంగిస్తూ మా నగరంలో సైనిక దళాలు ఉండరాదు. మేం వారికి తలవంచం, భయపడమన్నారు.
నేను రాజును కాదు; ట్రంప్
ఫాక్స్ న్యూస్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ నన్ను రాజు అంటున్నారు. కానీ నేను రాజును కాదు. నేను అలా వ్యవహరించడం లేదన్నారు. అలాగే ఇది అమెరికా పై ద్వేషంతో చేస్తున్న నిరసనల్లా ఉన్నాయని, ప్రజలు దేశద్రోహులుగా వ్యవహరిస్తున్నారని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ అభివర్ణిం చారు. నిరసనలను అణిచివేయడానికి చాలా చోట్ల సైనికులను మోహరించారు.
గతంలో కూడా ట్రంప్ పాలనను నిరసిస్తూ అనేక నిరసనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి
ఉమెన్స్ మార్చ్ – జనవరి 2017 ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు జరిగింది. లక్షల మంది అమెరికన్లు, ప్రపంచంలోని ఇతర నగరాల ప్రజలు కూడా ఇందులో పాల్గొన్నారు. మహిళా హక్కులు, ఎల్జీబీటీక్యూ హక్కులు, వలసవిధానం, జాతి సమానత్వం కోసం జరిగాయి. డాక్టర్ షరీఫ్ ఇమ్మిగ్రేషన్ నిరసనలు – 2017–2019 ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్, ముఖ్యంగా ముస్లిం-మెజారిటీ దేశాల నుంచి ప్రవేశం నిషేధించడంతో జరిగాయి.పెద్ద నగరాలు, ఎయిర్‌పోర్ట్లలో నిరసనలు చేపట్టారు. పోర్ట్‌ల్యాండ్‌లో ఫెడరల్ దళాల నిరసనలు – 2020
జార్జ్ ఫ్లోయిడ్ మృతి తర్వాత సంతాపాలు, అమెరికా అంతటా జాతి వ్యతిరేక నిరసనలు చెలరేగాయి.
మార్చ్ ఫర్ లివ్స్ – 2018 పాఠశాలల్లో జరుగుతున్న కాల్పులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ, విద్యార్థులు, విద్యాసంస్థలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ప్రస్తుతం నో కింగ్స్ పై నిరసనకారులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు.