
టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం చేపట్టారు. ఉదయం 7:30 గంటలకు శ్రీవారి ఆలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ సెక్రటరీగా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం ముద్దాడ రవిచంద్ర దంపతులు రంగనాయకుల మండపంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. గత నెల రోజులుగా తిరుమల పరిపాలన ఎలా జరుగుతోంది భక్తులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి అనే విషయాలను దగ్గరుండి గమనించాను. భక్తుల నుంచి మాకు చాలా సలహాలు, సూచనలు వచ్చాయి వాటన్నింటినీ నేను స్వయంగా పరిశీలించి భక్తులకు ఇంకా మంచి సౌకర్యాలు కల్పించేలా చూస్తాను అదేవిధంగా శ్రీవారి భక్తులకు సేవ చేయడం తన అదృష్టమని తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా ఆధ్యాత్మిక భావంతో వెళ్లేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
