Let's talk: editor@tmv.in
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంపై ఏసీబీ కేసు: రూ. 5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంపై ఏసీబీ కేసు: రూ. 5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో) మేండు లోకనాథంపై ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. తిరుపతిలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర కీలక ఆధారాలు లభించినట్లు ఏసీబీ వెల్లడించింది.

మంగళవారం తెల్లవారుజామున లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, నగదు, వెండి తదితరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లభించిన ఆధారాల ఆధారంగా లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏసీబీ వివరాల ప్రకారం.. లోకనాథం తిరుపతిలోని పీకే లేఅవుట్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసి తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే గోల్లవానిగుంట నివాస ప్రాంతంలో రెండు హౌసింగ్ ప్లాట్లతో పాటు ఓ భవనాన్ని కూడా భార్య పేరుతో కొనుగోలు చేసినట్లు సోదాల్లో లభించిన పత్రాల ద్వారా గుర్తించారు.

తిరుపతి జిల్లాలోని పాదిరేడు అరణ్యం గ్రామంలో కొనుగోలు చేసిన ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తిరుపతి అర్బన్ పరిధిలోని శ్రీనివాసనగర్‌లో ఆయన కుమారుడి పేరుతో రిజిస్టర్ చేసిన మరో ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు లభించాయి. లోకనాథం, ఆయన కుమారుడి పేర్లపై ఉన్న నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలు కూడా సోదాల్లో బయటపడ్డాయి.

లోకనాథం బావమరుదుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ఆయన భార్యతో పాటు ఇతరుల పేర్లపై ఉన్న సంయుక్త ఆస్తికి సంబంధించిన పత్రం లభించింది. ఆ ఆస్తి విలువ సుమారు రూ.31.9 లక్షలుగా ఏసీబీ పేర్కొంది. సోదాల్లో 2 కిలోల బంగారం, రూ.12.5 లక్షల నగదు, 6.5 కిలోల వెండి కూడా గుర్తించినట్లు తెలిపింది. లోకనాథంపై అవినీతి నిరోధక చట్టం-1988లోని సవరించిన 2018 నాటి సెక్షన్ 13(2), 13(1)(బి) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు సందర్భంగా టీటీడీలోని కొందరు ఉద్యోగుల ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు ఏసీబీ తెలిపింది. సీబీఐ తన దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన అనంతరం అందిన సమాచారంపై తదుపరి చర్యల్లో భాగంగా ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.

ఇదే వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కె.చిన్న అప్పన్నపై విశాఖపట్నం ఏసీబీ కార్యాలయం గతంలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఈ కేసు 2026 ఏప్రిల్ 22న నమోదైనట్లు ఏసీబీ తెలిపింది.

లోకనాథం 1989 ఫిబ్రవరి 1న కారుణ్య నియామకం ద్వారా టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాల్లో పనిచేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం తిరుమలలో టీటీడీ డిప్యూటీ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంపై ఏసీబీ కేసు: రూ. 5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు - Tholi Paluku