
'టీఆర్ఎస్' పేరుపై ఈసీ నోటీసు.. అభ్యంతరాల కాపీలు కోరిన కవిత
ఢిల్లీ హైకోర్టు జూలై 7న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీ శనివారం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇచ్చిన నోటీసుకు అధికారికంగా తన సమాధానాన్ని సమర్పించింది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన ఈ పార్టీ పేరుపై పలు అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈసీ ఆమెకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై పార్టీ స్పందిస్తూ.. ఏప్రిల్ 28న ఎన్నికల సంఘం తమకు "తెలంగాణ రక్షణ సేన" అనే పేరును ప్రాథమికంగా ఆమోదించిన తర్వాతే, రాష్ట్రంలోని దాదాపు 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. ఈ పేరుతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లో భారీ గుర్తింపు, ఆదరణ లభించాయని.. ఇప్పుడు ఈ దశలో పేరు మార్చమనడం తమ పార్టీ కార్యకలాపాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది.
జూన్ 23న ఈసీ లేఖలో దాదాపు 1,000 అభ్యంతరాలు వచ్చినట్లు పేర్కొన్నారని, అయితే ఆ అభ్యంతరాల కాపీలను తమకు అందజేయలేదని పార్టీ తెలిపింది. ఆ పత్రాలు లేకుండా అభ్యంతరాలలోని విశ్వసనీయతను తాము ఎలా అంచనా వేయగలమని ప్రశ్నించింది. కేవలం అభ్యంతరాల ‘సంఖ్య’ను బట్టి పేరు మార్చమనడం సరికాదని, అవి రాజకీయ ప్రేరేపితమైనవా లేదా నిజమైనవా అనేదానిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
పేరుపై స్పష్టత..
ప్రస్తుతం ఎన్నికల సంఘం రికార్డుల్లో 'తెలంగాణ రక్షణ సేన' పేరుతో ఎలాంటి రాజకీయ పార్టీ లేదు. 'తెలంగాణ' అనేది ఒక రాష్ట్రం పేరు కాగా, 'రక్షణ' అనేది ప్రజా బాహుళ్యంలో వాడే సాధారణ పదం. ఈ పదాలపై ఏ ఒక్కరికీ ప్రత్యేక హక్కులు ఉండవు, కాబట్టి ఇది ఏ పార్టీని పోలి లేదని పార్టీ స్పష్టం చేసింది. 2024లో నమోదైన తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్), 2023లో నమోదైన తెలంగాణ రాజ్య సమితి పార్టీల పేర్లు, ఉచ్చారణ, నాయకత్వం భిన్నమైనవని వివరించింది.
సహజ న్యాయ సూత్రాల ప్రకారం, అలాగే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు.. తమకు అభ్యంతరాల కాపీలను అధికారికంగా అందజేసిన తర్వాత, తమ వాదనలను స్వయంగా వినిపించడానికి వీలుగా వ్యక్తిగత విచారణకు ఒక తేదీని ఖరారు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
కాగా, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండి ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారిన పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో సహా దాదాపు 1,100కు పైగా ఫిర్యాదులు కవిత పార్టీ పేరుపై వచ్చాయి. కవిత మొదట తన పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సమితిస (టీఆర్ఎస్) గా ప్రకటించగా, పాత టీఆర్ఎస్ పేరుతో ప్రజలు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు వేరే పేరును ఎంచుకోవాలని ఈసీ ఇదివరకే సూచించినట్లు సమాచారం.
