Let's talk: editor@tmv.in
జేపీసీకి ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ సవరణ బిల్లు

జేపీసీకి ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ సవరణ బిల్లు

Pinjari Chand
13 ఆగస్టు, 2026

విపక్షాల ఆందోళనల మధ్య విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌‌ఏ–ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యూలేషన్‌ యాక్ట్‌) సవరణ బిల్లు-2026ను లోక్‌సభ బుధవారం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించింది. బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. జేపీసీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. లోక్‌సభ సభ్యులను స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ సభ్యులను ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ నామినేట్‌ చేయనున్నారు. 2026 శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజునాటికి కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించాల్సి ఉంటుంది.

విపక్షాలు వర్సెస్‌ ప్రభుత్వం

బిల్లును జేపీసీకి పంపించే విషయంపై తమకు చివరి నిమిషంలోనే సమాచారం అందిందని కాంగ్రెస్‌ ఎంపీ కే.సీ. వేణుగోపాల్‌ ఆరోపించారు. ఈ బిల్లు మైనారిటీలు, స్వచ్ఛంద సంస్థలను లక్ష్యంగా చేసుకునేలా ఉందని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు ఖండించారు. బిల్లుపై అభ్యంతరాలు ఉంటే జేపీసీలో చర్చించవచ్చని, ఇది ఏ మైనారిటీ వర్గాన్నీ లక్ష్యంగా చేసుకున్నది కాదని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ మొత్తం విపక్షం ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుకు వ్యతిరేకంగా ఉందన్నారు. డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు కూడా బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విపక్షాల ఆరోపణలకు స్పందించిన రిజిజు బిల్లులో మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న ఒక్క నిబంధననైనా చూపించాలని సవాల్‌ చేశారు. దేశంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.

బిల్లు ఉపసంహరించుకోవాలి: ప్రియాంక గాంధీ

విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు–2026 ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ బిల్లుపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని, ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలిపారు.

‘బిల్లు తీసుకురావాల్సిన అవసరమే లేదు’

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ కూడా ఎఫ్‌సీఆర్‌‌ఏ సవరణ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరమే లేదని అన్నారు. గిరిజనులు, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో విద్య, ఇతర సేవలను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు, మిషనరీలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. జార్ఖండ్‌, గుజరాత్‌లోని డాంగ్‌ ప్రాంతం తదితర గిరిజన ప్రాంతాల్లో ఎన్జీవోలు చేసిన సేవలు అనేక ప్రభుత్వాల కంటే ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇలాంటి సంస్థలపై ఆంక్షలు విధిస్తే వాటిపై ఆధారపడే పేదలు, పిల్లలకు విద్య, ఇతర సౌకర్యాలు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశీ నిధులపై మరింత పర్యవేక్షణ

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశంలోని ఎన్జీవోలు, విదేశీ నిధులపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం ఈ బిల్లులోని ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటి. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను కోల్పోయిన సంస్థల ఆస్తులను నిర్వహించేందుకు, అవసరమైతే వాటిని విక్రయించేందుకు ప్రత్యేక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే ఈ నిబంధనలు క్రైస్తవ ఎన్జీవోలు, మైనారిటీలు నిర్వహించే సామాజిక సంక్షేమ, విద్యా సంస్థలకు అందే చట్టబద్ధమైన విదేశీ నిధులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ బిల్లు మతపరమైన లక్ష్యంతో రూపొందించింది కాదని, విదేశీ విరాళాల నియంత్రణే ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియు రియో, మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా గతంలోనే బిల్లును జేపీసీకి పంపించాలని కేంద్రాన్ని కోరారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా కూడా బిల్లులోని కొన్ని నిబంధనలపై తమ సందేహాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

చర్చకు సిద్ధం: అమిత్‌ షా

ఇదిలా ఉండగా, నీట్‌ విద్యార్థుల ఆందోళనపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసినట్లు వెల్లడించారు. హోంమంత్రి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రిజిజు తెలిపారు.

18వ రోజూ ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం

వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమైనప్పటి నుంచి వివిధ అంశాలపై ప్రభుత్వం, విపక్షాల మధ్య విభేదాలతో లోక్‌సభ కార్యకలాపాలు పదేపదే స్తంభిస్తున్నాయి. బుధవారం వరుసగా 18వ రోజూ ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా సాగలేదు. ఉదయం ప్రారంభమైన ప్రశ్నోత్తరాల సమయం మూడు నిమిషాల్లోనే ముగిసింది.

తర్వాత విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన అనంతరం ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును జేపీసీకి పంపించే తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం మరోసారి సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమైన సభ.. విపక్షాల నిరసనల మధ్య గనులు, ఖనిజాల అభివృద్ధికి సంబంధించిన సవరణ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. అనంతరం సభను గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

ఇదే సమయంలో, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో లెక్కల్లో చూపని నగదు లభించిందన్న ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ నివేదికను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జార్ఖండ్‌లో పరీక్షల అవకతవకలపై ఆందోళన నేపథ్యంలో ఎన్డీయే సభ్యులు నగదుకు ప్రశ్నపత్రాల విక్రయానికి సంబంధం ఉందంటూ నినాదాలు చేశారు.

జేపీసీకి ‘ఎఫ్‌సీఆర్‌ఏ’ సవరణ బిల్లు - Tholi Paluku