Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల

Shaik Mohammad Shaffee
20 అక్టోబర్, 2025

దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గానూ సెషన్ 1, సెషన్ 2 పరీక్షల తేదీలను, దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.inలో ప్రకటించింది. అభ్యర్థులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను పక్కా ప్రణాళికతో మొదలుపెట్టాలని సూచించింది.

JEE మెయిన్ 2026 షెడ్యూల్ వివరాలు

JEE మెయిన్ 2026 పరీక్షలు గత సంవత్సరాల మాదిరిగానే రెండు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరుగుతాయి.

సెషన్ 1: అక్టోబర్ 2025 నుండి (త్వరలో తేదీలను ప్రకటిస్తారు) ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 3 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల అవుతాయి. ఫిబ్రవరి 2026లో సెషన్ 1 పరీక్ష ఫలితాలను ప్రకటిస్తారు (అంచనా).

సెషన్ 2: జనవరి 2026 చివరి వారం నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 1 నుంచి 10వ తేదీల మధ్య ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 3 రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల అవుతాయి. ఏప్రిల్ 2026లో సెషన్ 2 పరీక్ష ఫలితాలు విడుదలను ప్రకటిస్తారు (అంచనా).

ఈ డాక్యుమెంట్స్‌ అప్‌డేట్ తప్పనిసరి

జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తిరస్కరణకు గురి కాకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందుగానే తమ కీలక డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌టీఏ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంట్లను ఎన్‌టీఏ ఆధార్ డేటాబేస్ ద్వారా ధృవీకరిస్తుంది.

ఆధార్ కార్డు: ఆధార్ కార్డులో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం), తాజా ఫొటోగ్రాఫ్‌, ఇంటి అడ్రస్‌, తండ్రి పేరు అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలి.

దివ్యాంగ అభ్యర్థులైతే: యూడీఐడీ కార్డు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే విధంగా రెన్యువల్ చేయించుకోవాలి.

కేటగిరీ సర్టిఫికెట్: ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్‌సీఎల్ వంటి కేటగిరీ సర్టిఫికెట్‌లు చెల్లుబాటయ్యే విధంగా అప్‌డేట్ చేసుకోవాలి.

పరీక్ష కేంద్రాల విస్తరణ

దేశవ్యాప్తంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున, అందరికీ సౌకర్యంగా ఉండేలా ఎగ్జామ్‌ సిటీల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. మారుమూల ప్రాంతాల విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే, దివ్యాంగ అభ్యర్థులకు అవసరమైన ప్రత్యేక వసతులు కల్పించడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించింది.

జేఈఈ మెయిన్ పరీక్షలో పేపర్ 1 ద్వారా బీఈ/బీటెక్ కోర్సుల్లో, పేపర్ 2 ద్వారా బీఆర్క్/ బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.విద్యార్థులు పూర్తి సమాచారం కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ www.nta.ac.in, jeemain.nta.nic.inలను సందర్శించండి.

జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదల - Tholi Paluku