
జీవిత ఖైదు అనుభవిస్తూ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ నేత సజ్జన్ కుమార్ (80) గురువారం మృతి చెందారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సజ్జన్ కుమార్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసుల్లో మూడు దశాబ్దాలకు పైగా న్యాయపోరాటం ఎదుర్కొన్నారు. ఈ కేసుల్లో వివిధ కోర్టుల్లో ఆయనకు కొన్ని సందర్భాల్లో నిర్దోషిత్వం లభించగా, మరికొన్ని కేసుల్లో దోషిగా తేలారు.
ఐదుగురు హత్య కేసులో జీవిత ఖైదు
ఢిల్లీలోని రాజ్‌నగర్ ప్రాంతంలో ఓ కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేయడం, గురుద్వారాకు నిప్పుపెట్టిన కేసులో 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును కొట్టివేసి సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయనకు జీవిత ఖైదు విధించింది. దీంతో సజ్జన్ కుమార్ 2018 డిసెంబర్‌లో లొంగిపోయి అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు.
ఇంకో కేసులోనూ జీవిత ఖైదు
1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్ హత్యకు సంబంధించిన సరస్వతి విహార్ కేసులో తొలుత ట్రయల్ కోర్టు సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే 2025 ఫిబ్రవరి 25న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బావేజా ఆయనకు మరో జీవిత ఖైదు విధించారు. వయసు, అనారోగ్య సమస్యలు, ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో ఆయన ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని మరణశిక్ష విధించకుండా జీవిత ఖైదు విధించారు.
మరో కేసులో నిర్దోషిగా విడుదల
జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాల్లో జరిగిన హింసకు సంబంధించిన కేసులో సోహన్ సింగ్, ఆయన అల్లుడు అవతార్ సింగ్ హత్యలు, గుర్చరణ్ సింగ్‌ను సజీవదహనం చేయడాన్ని ప్రేరేపించారనే ఆరోపణలపై సజ్జన్ కుమార్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జనవరి 22న నిర్దోషిగా ప్రకటించింది. ఈ నిర్దోషిత్వ తీర్పుపై దాఖలైన అప్పీల్‌పై మే 26న ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ నోటీసులు జారీ చేసింది. జైలులో ఉన్న సమయంలో సజ్జన్ కుమార్ పలుమార్లు బెయిల్, వైద్య కారణాలతో ఉపశమనం కోరారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన న్యాయ విచారణల్లో 1984 అల్లర్లకు నేరపరమైన బాధ్యత ఎదుర్కొన్న ప్రముఖ మాజీ ప్రజాప్రతినిధుల్లో సజ్జన్ కుమార్ ఒకరు.
