
జార్ఖండ్ లో నీటి ట్యాంక్ కూలి విషాదం
జార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిమెంట్ నీటి ట్యాంక్ కూలిపోవడంతో, దాని కింద స్నానం చేస్తున్న ఇద్దరు గిరిజన చిన్నారులు మరణించారు.ఈ ఘోర ప్రమాదం సుందర్ పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దహుబేడా గ్రామంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన ఐదుగురు పిల్లల వయసు ఐదేళ్ల నుంచి తొమ్మిదేళ్ల ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామంలోని పాత కాంక్రీట్ నీటి ట్యాంకు ఉప్పొంగి పొంగిపోతోంది. దానిలోంచి పైపు ద్వారా వస్తున్న నీటితో పిల్లలు స్నానం చేస్తున్నారు. ఈ సమయంలో ట్యాంకు ఆకస్మికంగా చీలి కూలిపోవడంతో ఆ చిన్నారులు ట్యాంక్ శిధిలాల కింద ఇరుక్కున్నారు. అది గమనించిన గ్రామస్తులు వెంటనే వారిని బయటకు తీశారు కానీ దురదృష్టవశాత్తు అప్పటికే ఇద్దరు మృతిచెందారు.
ఇక గాయపడిన వారిని గోడ్డా సదర్ ఆస్పత్రికి తరలించగా, ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని బీహార్ రాష్ట్రంలోని భగల్పూర్ ఆస్పత్రికి తరలించారు, అని గోడ్డా డిప్యూటీ కమిషనర్ అంజలి యాదవ్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ, “గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నారు అదేవిధంగా ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు బాధితుల బంధువు బైజ్‌నాథ్ పహారియా మాట్లాడుతూ, “ట్యాంకు పాతది, చీలిపోయి ప్రమాదకరంగా ఉందని మేము పలుమార్లు అధికారులకు చెప్పాం కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు ఆ నిర్లక్ష్యమే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది,” అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. ఇదిలా ఉండగా ఘటనా స్థలాన్ని ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ శాఖ అధికారులు సందర్శించి, ట్యాంకు పునాదులు బలహీనంగా ఉండటం, వర్షకాల తేమ ప్రభావం వల్ల కాంక్రీట్ ట్యాంకు కూలిపోయినట్లు ప్రాథమిక ప్రాథమికంగా అంచనా వేశారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం ప్రకటించింది. గ్రామస్థులు ఇకపై పాత నీటి ట్యాంకులను పరిశీలించి, కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషాదం గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల బలహీనత, అధికారుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలకే ముప్పు అవుతోందని స్పష్టంగా చూపించింది.