
జాన్వీ కపూర్‌కు 'పెద్ది' టీమ్ బర్త్‌డే విషెస్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన 29వ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం దర్శించుకున్నారు. ప్రతి ఏటా తన పుట్టినరోజున తిరుమలకు రావడం ఆనవాయితీగా పెట్టుకున్న జాన్వీ, ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు.
సాధారణంగా విమానంలో వచ్చి నేరుగా కొండపైకి చేరుకునే సెలబ్రిటీలకు భిన్నంగా, జాన్వీ కపూర్ కాలినడకన అలిపిరి మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. 3,550 మెట్లు ఎక్కి తన భక్తిని చాటుకున్నారు. భారీ భద్రత నడుమ ఆమె ఈ యాత్రను పూర్తి చేశారు. తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆమె అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
'పెద్ది' టీం సర్ప్రైజ్
ఇదిలా ఉండగా, ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం 'పెద్ది' టీమ్ కూడా ఈ ప్రత్యేక రోజును ఘనంగా జరుపుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆమె నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్లు, వీడియోలను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రను 'అచియ్యమ్మ, 'చికిరి' అని పిలుస్తూ ఆమె పవర్ఫుల్ రోల్‌ను పరిచయం చేశారు.
బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొన్ని మార్పుల కారణంగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
