Let's talk: editor@tmv.in
జవహర్‌నగర్ బాధితులను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శ

జవహర్‌నగర్ బాధితులను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శ

Gaddamidi Naveen
12 జులై, 2026

జవహర్‌నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అఖిలపక్ష, జేఏసీ నాయకులను పోలీసులు అర్ధరాత్రి ఇళ్లల్లోకి దూరి అరెస్టు చేయడాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాధితులను ఆయన శనివారం పరామర్శించి, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు స్థానిక చెత్త కోసమే ఉన్న ఈ యార్డులో, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు రెండు కోట్ల మంది చెత్తను తెచ్చి వేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా ఒకే చోట ఇంత భారీగా చెత్తను వేయరన్నారు. రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంటే, కేవలం 3,500 మెట్రిక్ టన్నుల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, మిగిలిన 6,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజూ పేరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బాలాజీనగర్, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, కీసర, నాగారం, ఘట్‌కేసర్ వరకు నీళ్లన్నీ కలుషితమై, భరించలేని వాసన వస్తోందని పేర్కొన్నారు.

గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి దీనిపై సుప్రీం కోర్టులో కేసు వేశారని, కానీ ముఖ్యమంత్రి అయి రెండున్నర ఏళ్లు దాటినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి రెండు నెలలైనా స్పందన లేదన్నారు. నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి నిరసన హక్కును కాలరాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాలను ఆపలేరని, ఏ కాంట్రాక్టర్ల మెప్పు కోసమో పేదల జీవితాలతో చెలగాటమాడవద్దని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. నగరం నలుదిక్కులా డంప్ యార్డులు పెట్టి చెత్తను డిస్ట్రిబ్యూట్ చేయాలని, జీరో పొల్యూషన్ సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
EtelaRajenderJawaharNagarDumpYardIssueMedchalMalkajgiriGHMCEnvironmentalPollutionWasteManagementTelanganaNewsHyderabadNews