Let's talk: editor@tmv.in
జవహర్ నగర్ డంప్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు: ఎంపీ ఈటల రాజేందర్
జవహర్ నగర్ డంప్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు: ఎంపీ ఈటల రాజేందర్

జవహర్ నగర్ డంప్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు: ఎంపీ ఈటల రాజేందర్

Gaddamidi Naveen
16 జులై, 2026

జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత ముగింపు పడేంత వరకు తాను స్థానిక ప్రజల్లో ఒకడిగా ఉంటూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జవహర్ నగర్ డంప్ యార్డ్ వ్యతిరేక పోరాట అఖిలపక్ష నేతలు, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ వద్ద వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా చెత్త కుప్పల మధ్య, కాలుష్య కోరల్లో నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దుస్థితి నుంచి విముక్తి లభించాలంటే పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ రే తమ పోరాటానికి నాయకత్వం వహించాలని కోరారు. ఇటీవల తాము నిరసన తెలిపినప్పుడు పోలీసులు అక్రమంగా స్టేషన్‌లో నిర్బంధిస్తే, స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించినందుకు ఈటలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు డంప్ యార్డును పూర్తిగా తరలిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని నేతలు విమర్శించారు.

అఖిలపక్ష నేతల వినతిపై సానుకూలంగా స్పందించిన ఈటల రాజేందర్, బాధితులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో మీరే ఈ డంప్ యార్డుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు వేశారు. ప్రశ్నించే గొంతుకగా నిలిచారు. ఇప్పుడు మీరే అధికారంలో, సమస్యను పరిష్కరించే స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇకనైనా తాత్సారం చేయకుండా వెంటనే దీనికి పరిష్కారం చూపించండి అని ఆయ‌న తెలిపారు.

అరెస్టులతో సమస్యలు ఆగవు

తెలంగాణ పల్లెల నుంచి వలసవచ్చిన నిరుపేదల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడకూడదని ఈటల హెచ్చరించారు. గతంలో సీఎం దీనిపై విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారని, పోయిన వారం కూడా మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడానని తెలిపారు. అయితే పాలకులు, అధికారులు మాట తప్పడం వల్లే నేడు జవహర్ నగర్ పరిసరాలు మూసీ నది కంటే అధ్వాన్నంగా మారాయన్నారు.

జేఏసీ నేతలు నిరసనకు పిలుపునివ్వగానే అక్రమ అరెస్టులకు దిగడం దుర్మార్గమని, అరెస్టుల వల్ల సమస్యలు పరిష్కారం కావని మండిపడ్డారు. తనపై గతంలో 200 కేసులు పెట్టారని, ప్రజా ఉద్యమాల్లో నడిచిన తనకు ఈ కేసులు కొత్తేమీ కాదన్నారు. జవహర్ నగర్ ప్రజల బాధలను దేశ రాజధానిలో వినిపిస్తానని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడుతానని స్పష్టం చేశారు. మన పోరాటం శాంతియుతంగా ఉండాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
JawaharNagarDumpYardIssueEtelaRajenderMalkajgiriMPSaveJawaharNagarPollutionFreeTelanganaEnvironmentalJusticePublicHealthTelanganaNews
జవహర్ నగర్ డంప్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు: ఎంపీ ఈటల రాజేందర్ - Tholi Paluku