
జనాభా పెంపు కాదు.. ఉపాధి, నైపుణ్యాలపై దృష్టి పెట్టండి: కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జనాభా నిర్వహణ విధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ముఖ్యంగా మూడో సంతానం లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలకు రూ.25 వేల ఆర్థిక ప్రోత్సాహకం అందించాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం దృష్టి జనాభా పెంపుపై కాకుండా ఉన్న యువతను ఆధునిక నైపుణ్యాలతో తీర్చిదిద్దడంపైనే ఉండాలని ఆయన హితవు పలికారు. కేవలం సంఖ్యను పెంచడం వల్ల ప్రయోజనం ఉండదని అది భవిష్యత్తులో మరిన్ని సవాళ్లకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాణిక్యం ఠాగూర్, ఏపీ ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న దార్శనికతను ప్రశ్నించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి సాంకేతిక మార్పుల వల్ల భవిష్యత్తులో అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్ధం చేయడమే ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమని రాబోయే దశాబ్దాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, కాబట్టి జనాభా కొరత అనేది మన దేశానికి అసలు సమస్యే కాదని ఆయన స్పష్టం చేశారు.
లక్షలాది మంది యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, తగిన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడమే అసలైన సంక్షోభమని ఠాగూర్ విశ్లేషించారు. జనాభా పెంపును ప్రోత్సహించేందుకు నగదు ఆశ చూపడం అనేది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కాదని, ఇది కేవలం ఒక తాత్కాలిక రాజకీయ ఆలోచనగా మాత్రమే కనిపిస్తోందని విమర్శించారు. జనాభా పెరుగుదలను రాజకీయ లేదా సిద్ధాంతపరమైన కోణంలో చూడటం సరికాదని, ప్రజా విధానాలు ఎప్పుడూ ఆర్థిక వాస్తవాల ప్రాతిపదికన ఉండాలని ఆయన హెచ్చరించారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో వృద్ధాప్య సమస్యలు, జనాభా తగ్గుదల ఉన్నందున అక్కడ ప్రోత్సాహకాలు ఇస్తున్నారని కానీ మన దేశ పరిస్థితులు అందుకు భిన్నమని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో సీఎం ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం సంతానోత్పత్తి రేటు1.5కి పడిపోయిందని, జనాభా సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే అది కనీసం 2.1 ఉండాలని స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి పెరిగే కొద్దీ సంతానోత్పత్తి తగ్గుతోందని దీనివల్ల భవిష్యత్తులో పనిచేసే యువశక్తి తగ్గిపోయి రాష్ట్రం వృద్ధులమయంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 58 శాతం కుటుంబాలు కేవలం ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నాయి. ఈ ధోరణిని మార్చడానికి జనాభా సమతుల్యతను కాపాడటానికి రెండో లేదా మూడో సంతానం కలిగిన తల్లులకు ప్రసవ సమయంలో రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ విధానంపై రాష్ట్రవ్యాప్తంగా మేధావులు, రాజకీయ నేతల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం జనాభా స్థిరీకరణ అవసరమని కొందరు అంటుంటే ఉన్న జనాభాకే సరైన సౌకర్యాలు లేవని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ జనాభా విధానం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
